నిర్భయ దోషులకు శిక్ష అమలులో జాప్యం జరుగుతూనే ఉంది. నిందితులు తెలివిగా వేస్తున్న పిటిషన్ల వల్ల ఉరి శిక్ష అమలుకు సాధ్యపడటం లేదు. శిక్ష అమలులో జరుగుతున్న జాప్యం వల్ల కేంద్రం నిందితులను వేర్వేరుగా ఉరి తీసేందుకు వీలు కల్పించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణకు వచ్చిన నేపథ్యంలో దోషులకు డెత్ వారెంట్లు జారీ అయ్యాయని సొలిసిటరీ జనరల్ సుప్రీం కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ పై విచారణను మార్చ్ 5 కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. కాగా పాటియాలా కోర్టు నిర్భయ దోషులకు మార్చ్ 3న ఉరి తీసేందుకు డెత్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో నిర్భయ దోషులకు శిక్ష అమలయ్యే విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నిర్భయ దోషుల్లో మరొకరికి వివిధ పిటిషన్లు జారీ చేసుకునే వెసులుబాటు ఉండటంతో శిక్ష అమలులో జాప్యం జరుగుతుందనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఒక నేరంలో పాలుపంచుకున్న దోషులందరికీ ఒకేసారి శిక్ష అమలు చేయాలన్న నిబంధన ఉండటంతో, దోషుల్లో ఎవరి పిటిషన్ అయినా పెండింగ్ లో ఉంటే శిక్ష విధించే అవకాశం ఉండదు. అందుకే దోషులకు వ్యతిరేకంగా వేర్వేరుగా ఉరి తీయడానికి అనుమతిని ఇవ్వాలని కేంద్రం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణను మార్చ్ 5కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.