iDreamPost
android-app
ios-app

‘చిత్ర’స్వరంలో రాజా లయవిన్యాసం – Nostalgia

  • Published Mar 14, 2020 | 6:35 AM Updated Updated Mar 14, 2020 | 6:35 AM
‘చిత్ర’స్వరంలో రాజా లయవిన్యాసం – Nostalgia

ఒకే తరహా సాంప్రదాయ పద్ధతిలో ఇంకా చెప్పాలంటే మూసలో సాగుతున్న సినిమా సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఇళయరాజా బెస్ట్ సాంగ్స్ ని ఎంచుకోమనే పరీక్ష పెడితే ఒక్క రోజులో దాన్ని పూర్తి చేయడం అసాధ్యం. అంత స్థాయిలో అన్నేసి గొప్ప పాటలు ఇచ్చారు కాబట్టే జనరేషన్ తో సంబంధం లేకుండా ప్రతిఒక్కరు ఆయన గీతాలను ఇష్టపడతారు ప్రేమిస్తారు. అలాంటి రాజాను ప్రత్యక్షంగా అందులోనూ స్వయంగా కంపోజ్ చేసిన పాటలను లైవ్ చూసే ఛాన్స్ మాత్రం ప్రతిసారి వచ్చేది కాదు.

కొన్నేళ్ల క్రితం రాజా యుఎస్ లో నిర్వహించిన విభావరిలో లైవ్ గా ఇచ్చిన పెర్ఫార్మన్స్ కు ప్రవాసాంధ్రులతో పాటు అక్కడికి వచ్చిన ప్రతిఒక్కరు పరవశంలో తడిసి ముద్దయ్యారు. అందులో నుంచి తీసుకున్న ఓ చిన్న మెచ్చుతునక ఇది. 1988లో కార్తీక్, ప్రభు హీరోలుగా ఘర్షణ వచ్చింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా “నిన్ను కోరి వర్ణం సరిసరి కలిసేనే నయనం, ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే, తలపులు కదిలేనే, చెలి మది విరిసేనే, అనుదినము నిన్ను కోరి వర్ణం” అంటూ రాజశ్రీ అందించిన సాహిత్యం అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించింది.

అప్పట్లో చిత్ర గాత్రానికి మైమరిచిపోని వారు లేరు. రేడియోలో విన్నా టేప్ రికార్డులు పాడుతున్నా ఈ పాట ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా వినిపించేది. ఈ సాంగ్ షూట్ ని మణిరత్నం రాత్రి వేళ ఓ చీకటి గదిలో చాలా డిఫరెంట్ స్టైల్ లో ఫ్లాష్ లైట్ మిక్సింగ్ ని తీసుకుని అమల, ప్రభుల పై చిత్రీకరించడం ఆ టైంలో ఓ సెన్సేషన్. ఇదే పాటను పాతికేళ్ల తర్వాత చిత్ర గారు అదే మేజిక్ తో మళ్ళీ స్టేజి మీద పాడటం చూసి ఆవిడ ఎందుకు అంత గొప్ప గాయనిగా పేరు తెచ్చుకున్నారో అర్థమవుతుంది. ఘర్షణ వచ్చి 32 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఇలాంటి పాటల్లోని మేజిక్ ఫ్రెష్ గా అనిపిస్తోందంటే అది రాజా మహత్యం తప్ప మరొకటి కాదు.