Idream media
Idream media
1967లో వచ్చిన నిండు మనసులు సినిమాలో హీరో ఎన్టీఆర్ , హీరోయిన్ దేవిక. కానీ వారి మధ్య ఒక్క డ్యూయెట్ కూడా లేదు. సినిమా మొత్తం మీద ఒకర్నొకరు తాకను కూడా తాకరు. ఉన్న డ్యూయెట్ హాస్య జంట రాజబాబు, వాణిశ్రీల మధ్య ఉంటుంది.
ఒక మంచి అమ్మాయి, దొంగ ఇంట్లో ఉండాల్సి వస్తే అది నిండు మనసులు. అదే అమ్మాయి ఇంట్లో ఒక దొంగ ఉండాల్సి వస్తే వెంకటేష్ సినిమా రాజా అవుతుంది. ఎన్టీఆర్ జైలు నుంచి విడుదల కావడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. అతని పేరు రాజు, (అప్పట్లో రౌడీలుగా ఉంటే రాజు, కాలేజీ కుర్రాడైతే గోపీ అనే పేరు కామన్) పచ్చి రౌడీ. ఒక సందర్భంలో హత్య కేసులో ఇరుక్కొని విలన్ రాజనాల ట్రాప్‌లో చిక్కుకుంటాడు. రోజీ (ఎల్.విజయలక్ష్మి) హీరోపై మనసు పడుతుంది. పాటలు పాడుతుంది. ఎన్టీఆర్ పట్టించుకోడు. వ్యాంప్ కారెక్టర్ అంటే చివర్లో విలన్ కాలుస్తున్నప్పుడు హీరోకి అడ్డం వచ్చి చచ్చిపోవాలి. అది రూల్. దాని ప్రకారం రోజీ చివర్లో చచ్చిపోతుంది.
ఇష్టం లేని పెళ్లి వల్ల హీరోయిన్ దేవిక ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నిస్తే, సహజంగానే హీరో కాపాడి ఇంటికి తీసుకెళుతాడు. అక్కడ ఆమె వెంకటేశ్వరస్వామిని పూజిస్తూ , చివరికి హీరోని మంచివాడిగా మారుస్తుంది.
ఎన్టీఆర్ టైట్ టీ షర్ట్‌లు వేస్తూ , విచిత్రంగా నడుస్తూ ఉంటాడు. ఫైట్స్‌లో ఆయన చేసిందాని కంటే డూప్స్ చేయడమే ఎక్కువ. ఈ సినిమాలో కొన్ని సీన్స్ హైదరాబాద్‌లో తీశారు. 50 ఏళ్ల క్రితం ట్యాంక్ బండ్ ఎలా ఉండేదీ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చుట్టూ ఖాళీగా కొండలు కనిపిస్తూ ఉంటాయి.
హీరో ఇష్టం వచ్చినట్టు దొంగతనాలు చేస్తూ కూడా , తాను మంచివాడని వాదిస్తూ ఉంటాడు. మానవత్వం గురించి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. టీవీ రాజు సంగీతంలో హిట్‌సాంగ్స్ ఉన్నాయి. యధావిధిగా ఒక హిందీ పాటను మక్కీకి మక్కీ దింపేశాడు.
రాజబాబుకి డిమాండ్ పెరుగుతున్న రోజులు కాబట్టి, ఆయనకి రెండు పాటలు ఉన్నాయి. రొటీన్ కథే అయినా చెడ్డగా ఉన్న హీరోని హీరోయిన్ మార్చే కథలు ఆ తర్వాత చాలా వచ్చాయి. నిండు మనసులు టైటిలే విచిత్రం. చివర్లో శుభం కార్డుకి ముందు టైటిల్ జస్టిఫికేషన్ కోసం “మీవి నిజంగా నిండు మనసులు” అని డైలాగ్ చెప్పిస్తారు. తర్వాత “నిండు” అని చాలా సినిమాలు వచ్చాయి.
ఎస్‌డీ లాల్ డైరెక్షన్ చేశారు. ఎన్టీఆర్‌తో తీసిన హిందీ రీమేక్ సినిమాలకి తర్వాతి రోజుల్లో ఈయనే డైరెక్టర్. ఎన్టీఆర్ విచిత్రమైన డ్యాన్స్‌లు చూడాలనుకుంటే యూట్యూబ్‌లో చూడొచ్చు.