iDreamPost
android-app
ios-app

పంచాయతీ పోరు.. నిమ్మగడ్డ మరో అడుగు..!

పంచాయతీ పోరు.. నిమ్మగడ్డ మరో అడుగు..!

నేను చెప్పిందే వేదం.. చేసిందే చట్టం.. అన్నట్లుగా వ్యవహారిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఏపీ ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి మరో లేఖ రాశారు. ఈ సారి రాసిన లేఖలో.. ఓటర్ల జాబితాను నవీకరించాలనే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేలా చర్యలు చేపట్టాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 2021 జనవరిలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. త్వరలో అన్ని జిల్లాల అధికారులతో ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్‌కు కూడా సిద్ధమవుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తాను జారీ చేసిన ప్రోసీడింగ్స్‌పై హైకోర్టు స్టే ఇవ్వని విషయాన్ని ఈ సందర్భంగా నిమ్మగడ్డ తన లేఖలో పేర్కొన్నారు. కరోనా తగ్గిందని, కేంద్రం నుంచి నిధులు వచ్చేందుకు ఎన్నికలు నిర్వహణ ముఖ్యమంటూ నిమ్మగడ్డ తన లేఖలో మరోమారు ప్రస్తావించారు.

మార్చిలో నామినేషన్ల దశలో ఉన్న స్థానిక ఎన్నికలను కరోనా వైరస్‌ పేరు చెప్పి వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. మళ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నవంబర్‌ నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. మార్చి 31వ తేదీన ఉద్యోగ విమరణ చేయబోతున్న నిమ్మగడ్డ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లోపు ఎన్నికలు నిర్వహించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలో తనకు ఉన్న అన్ని రకాల అవకాశాలను ఉపయోగిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్నా.. ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతున్నారు. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధుల కోసమే.. మార్చి నెలాఖరులోపు ఎన్నికలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేసింది. ఆ మేరకు నాడు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర బడ్జెట్‌ రూపలక్పన, అసెంబ్లీలో ఆమోద ప్రక్రియను ప్రభుత్వం వాయిదా వేసుకుంది. కానీ నాడు ఇవేమీ పట్టించుకోని నిమ్మగడ్డ రాష్ట్రంలో రెండు కేసులు ఉన్నప్పుడు వాటిని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేశారు. నాడు ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఎన్నికలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని ప్రయత్నం చేసిందో.. నేడు నిమ్మగడ్డ కూడా అదే దారిలో నడుస్తున్నారు. కానీ ఆర్థిక సంఘం నుంచి స్థానిక సంస్థలకు నిధులు ఇప్పటికే పలు దఫాలుగా విడుదలైన విషయం నిమ్మగడ్డ తన లేఖలో పేర్కొనకపోవడం విశేషం.

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఈ నెల 4వ తేదీన ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. అయినా.. కూడా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తన ప్రయత్నాలను కొనసాగిస్తుండడం ఆయన వైఖరిని తేటతెల్లం చేస్తోంది. వేసవిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రులు ఇప్పటికే ప్రకటనలు చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తన ప్రవర్తనతో ఇప్పటికే వివాదాస్పద అధికారిగా, ఓ పార్టీకి కొమ్ముకాసే వ్యక్తిగా పేరు తెచ్చుకున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. తాను అనుకున్నది చేయాలనే భావనలో ఇకపై ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నిమ్మగడ్డ పదవీ కాలం మరో మూడు నెలలు ఉన్న నేపథ్యంలో.. రాబోవు రోజుల్లో ఆయన వైఖరి మరింత వివాదాస్పదంగా మారే అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. పదవీ విమరణ చేసే వరకూ రాష్ట్ర ప్రభుత్వంతో నిమ్మగడ్డ ఘర్షణాత్మక వైఖరి కొనసాగే అవకాశం ఉంది.