తొలగింపుపై హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్

తొలగింపుపై హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్

ప్రభుత్వానిది అధికార దుర్వినియోగం అని ఆరోపణ.

రాష్ట్ర ఎన్నికల అధికారి పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించడం , అర్హతలను మార్పు చేయడం, తద్వారా తన పదవి పోవడానికి ప్రభుత్వం కారణమైందని పేర్కొంటూ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామం అందరూ ముందే ఊహించిందే,
శనివారం ఈ పరిణామం జరిగిన విషయం అందరికి తెలిసిందే.

అయితే ఈ నేపథ్యంలో తన పిటిషన్ ను అత్యవసర పిటిషన్ గా పరిగణించాలని ఆయన కోరారు. ఈమేరకు రమేష్ కుమార్ తరఫున అశ్వనీకుమార్ అనే న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాల్సిందిగా కోర్టును కోరారు. ఆర్డినెన్స్ , ఆ తర్వాత జారీ అయిన జీవోలను రద్దుచేయాలని, జస్టిస్ వి.కనగరాజ్ ను నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోనూ రద్దు చేయాలని, తాను ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసేలా ఆదేశించాలని నిమ్మగడ్డ కోరారు.

తన విషయంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన పిటిషన్ లో ఆరోపించారు. తనను తొలగించాలన్న లక్ష్యంతోనే ఈ ఆర్డినెన్స్ తెచ్చారని ఆయన ఆరోపించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్డినెన్స్ తీసుకురావాలి గానీ రాజకీయ ప్రయోజనాల కోసం కాదని ఆయన తెలిపారు. కోర్టులో సవాల్ చేయడానికి ముందుగానే కనగరాజ్ ను విజయవాడకు రప్పించి బాధ్యతలు అప్పగించారని ఆయన ఆరోపించారు. ఈయన కాకుండా మరో ఇద్దరు కూడా ఈ విషయం మీద కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను సోమవారం విచారణకు స్వీకరించే అవకాశం ఉంది. 

Show comments