iDreamPost
android-app
ios-app

వాయిదాకు అవసరంలేదు.. నిర్వహణకు మాత్రం అందరూ కావాలి..

వాయిదాకు అవసరంలేదు.. నిర్వహణకు మాత్రం అందరూ కావాలి..

బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తులపై బాధ్యత అధికంగా ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ హోదాలో ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మాత్రం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారనే బలమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కేంద్రంగా మరోమారు రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకోవాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు మరో ఐదు నెలలు మాత్రమే పదవీ కాలం ఉంది. ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఇబ్బంది పెట్టడం, చికాకు పెట్టడమే లక్ష్యంగా రమేష్‌కుమార్‌ పని చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

కోవిడ్‌ వ్యాప్తి కొనసాగుతూ ప్రస్తుతం రోజుకు మూడు నుంచి నాలుగువేల కేసులు నమోదవుతున్న తరుణంలో ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఎన్నికల నిర్వహణ నవంబర్, డిసెంబర్‌లలో సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిసెంబర్‌ తర్వాత అప్పటి పరిస్థితిని బట్టీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా, ఎలాంటి సంప్రదింపులు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిద్దాం రమ్మంటూ రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని చెప్పినా.. నిమ్మగడ్డ సమావేశం నిర్వహించేందుకే సిద్ధమవ్వడం ఆయన లక్ష్యం ఏమిటో స్పష్టం చేస్తోంది.

మార్చిలో ముమ్మురంగా సాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్‌ను బూచిగా చూపి ఏకపక్షంగా వాయిదా వేశారు. నాడు ప్రభుత్వంతోగానీ, రాజకీయ పార్టీలు, వైద్య విభాగంతోగానీ ఎలాంటి చర్చ జరపలేదు. ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండానే అర్థంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు తిరిగి ఎన్నికల నిర్వహించేందుకు మాత్రం రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. వాయిదా వేసే సమయంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోని నిమ్మగడ్డ.. వాయిదా వేసిన ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు మాత్రం రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలనుకుంటుండడం ఆయన అనుసరిస్తున్న ద్వంద విధానానికి అద్దంగా నిలుస్తోంది.

గురువారం రాష్ట్రంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన 18 రాజకీయ పార్టీల అభిప్రాయాలు వేర్వేరుగా తీసుకోవాలని నిమ్మగడ్డ నిర్ణయించారు. ఒక్కొక్కరితో పది నిమిషాల చొప్పన మాట్లాడాలని నిర్ణయించారు. ప్రభుత్వం అభిప్రాయం ఇప్పటికే బహిరంగంగా వెల్లడైన నేపథ్యంలో ఇతర పార్టీల అభిప్రాయాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికర అంశం. ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు ఎన్నికల జరిపేందుకు సుముఖత తెలిపే అవకాశం ఉంది. ఇతర గుర్తింపు పొందిన పార్టీలు కూడా అదే దారిలో నడిస్తే.. మెజారిటీ పార్టీల అభిప్రాయం.. ఎన్నికలు నిర్వహిచేందుకు అనుకూలంగా ఉందంటూ.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసే అవకాశం ఉంది.

రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపిన అభిప్రాయం మేరకు ఏపీ హైకోర్టు ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తాజా పరిణామాలు ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన వైఖరిని వెల్లడించిన నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు ఎలాంటి రాజకీయ వివాదాలకు దారి తీస్తాయో, ఇందులో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పాత్ర ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.