iDreamPost
iDreamPost
ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. తప్పుడు వార్తలతో జనాలను పక్కదారి పట్టిస్తున్న మీడియా సంస్థలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో ఫేక్ లెటర్ అంటూ ఆరోపణలు వచ్చిన ఏపీ ఎన్నికల సంఘం మాజీ అధికారి కేసులో కూడా విచారణ వేగవంతం చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదుతో ఈ లేఖ అంశం వివాదాస్పదం అయ్యింది. ఏపీలో స్థానిక ఎన్నికల వాయిదా వేసిన తర్వాత పరిస్థితిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో ఓ లేఖ కేంద్ర హోం శాఖకు చేరింది. ఆ లేఖలో ఓ అధికారి వాడిన భాష కన్నా రాజకీయ నేతల విమర్శలు ఎక్కువగా ఉన్న తరుణంలో అప్పట్లో అది కలకలం రేపింది. చివరకు ఆ లేఖను తాను రాయలేదన్నట్టుగా సీఎస్ఈ ఖండించారని ఓ లీక్ ప్రచారంలో పెట్టారు. తీరా వ్యవహారం ఏపీ పోలీసుల వద్దకు చేరడంతో ఆ లేఖను తాను రాసినట్టు నిమ్మగడ్డ అంగీకరించారు.
అప్పటికే నిమ్మగడ్డ లేఖను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ధృవీకరించారు. తదనంతర పరిణామాల్లో ఎస్ఈసీ నియామక అర్హతల్లో వచ్చిన మార్పులతో నిమ్మగడ్డ పదవికి గండం ఏర్పడింది. ఆ తర్వాత లేఖను తానే రాసినట్టు ఆయన అంగీకరించడం విస్మయకరంగా మారింది. అయినప్పటికీ విజయసాయిరెడ్డి వ్యక్తం చేసిన అనుమానాలతో ఏపీ సీఐడీ రంగంలో దిగి పలు ఆధారాలు సేకరించింది. ముఖ్యంగా లేఖకు సంబంధించిన ఆధారాలను ఎన్నికల సంఘం అధికార కంప్యూటర్లలో చెరిపివేసినట్టు గుర్తించారు. దాంతో మరింత పగడ్బందీగా దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు హైదరాబాద్ చేరారు.
Also Read: నిమ్మగడ్డ రమేష్ ప్రభుత్వానికి దొరికిపోయారా?
అందులో భాగంగా నిమ్మగడ్డ పీఏగా పని చేస్తున్న సాంబమూర్తిని సీఐడీ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కేసులో పూర్తి విచారణలో భాగంగా అయన్నుంచి సమాచారం సేకరించేందుకు గానూ హైదరాబాద్ లోని సీఐడీ కార్యాలయంలో విచారణ సాగిస్తున్నారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం , ఇతర ఆధారాలను చెరిపేసే ప్రయత్నం చేయడంతో పెరిగిన సందేహాలకు సమాధానాలు రాబట్టే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా కీలక ఆధారాలు కూడా సేకరించినట్టు సమాచారం . నిమ్మగడ్డ పీఏతో పాటుగా రాష్ట్ర ఎన్నికల సంఘంలో పనిచేసి ఇతర సిబ్బంది ద్వారా సేకరించిన సమాచారం ద్వారా పలు చర్యలకు పూనుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి చట్టపరమైన చిక్కులు తప్పవని అంతా భావిస్తున్నారు. తాజా పరిణామాలతో ఇప్పుడీ కేసు హాట్ టాపిక్ అయ్యింది.