ఆ లేఖ నిమ్మగడ్డ రాయలేదు.. తేల్చిన సిఐడి విచారణ!

  • Published - 05:15 AM, Wed - 6 May 20
ఆ లేఖ నిమ్మగడ్డ రాయలేదు.. తేల్చిన సిఐడి విచారణ!

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ వ్యవహారం కేసు పలు మలుపులు తిరుగుతుంది.

మొదట్లో తాను ఆ లేఖ రాయలేదంటూ నిమ్మగడ్డ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ఈ లేఖ ఎవరు రాశారో తేల్చాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. నిమ్మగడ్డ లేఖ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి రంగంలోకి దిగిన సీఐడీ ప్రాథమిక సమాచారం సేకరించింది. నిమ్మగడ్డ పీఎస్‌ సాంబమూర్తిని పలు దఫాలుగా విచారించిన సీఐడీ నిమ్మగడ్డ రాసినట్లు పేర్కొంటున్న లేఖ బయట నుండే వచ్చిందనే నిర్ధారణకు వచ్చింది.

సిఐడి అధికారులు విచారణలో నిమ్మగడ్డ పీఎస్‌ సాంబమూర్తి మొదట్లో వెల్లడించిన విషయాలు అసత్యాలని విచారణలో తేలింది.సాంబమూర్తి ప్రాథమిక విచారణలో వెల్లడించిన విషయాలను పరిగణలోకి తీసుకుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పిన విషయాలను లేఖలో టైప్ చేయడానికి అంగీకరించానని, తన కంప్యూటర్లో టైప్ చేసిన పిదప హార్డ్ కాపీని నిమ్మగడ్డకు ఇచ్చానని వెల్లడించారు. ఈ లేఖపై నిమ్మగడ్డ సంతకం చేసిన తరువాత, లేఖను స్కాన్ చేసి, పెన్ డ్రైవ్‌లో కాపీ చేసి,కంప్యూటర్ నుంచి వాట్సాప్ నంబర్‌కు ఒక సాఫ్ట్ కాపీని నిమ్మగడ్డకు పంపానని సాంబమూర్తి సిఐడి అధికారులకు వెల్లడించారు. తర్వాత పెన్ డ్రైవ్ ను నాశనం చేసి లేఖకు సంబంధించిన ఆధారాలను కంప్యూటర్ నుండి పూర్తిగా తొలగించానని సాంబమూర్తి విచారణలో వెల్లడించారు.

కాగా నిమ్మగడ్డ పీఎస్ చెప్పిన విధంగా లేఖ తయారుచేయబడలేదని ఫోరెన్సిక్ అధికారులు తేల్చడంతో సాంబమూర్తి విచారణలో వెల్లడించిన విషయాలన్నీ అసత్యాలని తేలింది. విచారణను తప్పుదోవ పట్టించే విధంగా సాంబమూర్తి తప్పుడు సమాచారం ఇచ్చాడని సీఐడీ నిర్ధారణకు వచ్చింది. దీంతో సీఐడీ నిమ్మగడ్డ లేఖ కేసును అనేక కోణాల్లో విచారణ చేస్తుంది. పెన్ డ్రైవ్ ద్వారా లేఖ బయటకు వచ్చిందని సీఐడి గుర్తించింది. ముందుగానే లేఖను బయటనుండి తయారుచేసి తీసుకువచ్చారని, దాన్నే హోమ్ శాఖకు పంపారని, ఆ లేఖ ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో తయారు కాలేదనే సీఐడి నిర్ధారణకు వచ్చింది.దాంతో పాటు తప్పుడు సమాచారం ఇచ్చిన సాంబమూర్తిపై సీఐడీ కేసు నమోదు చేసింది.

ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో తయారైన లేఖ కాదని తేలడంతో ఇప్పుడీ లేఖ ఎక్కడ తయారైందన్న కోణంలో సీఐడీ ఆధారాలు సేకరించే పనిలో పడింది. ఎన్నికల కమీషనర్ కార్యాలయంలో తయారు చేయకపోయినా తమ కార్యాలయంలో ఆ లేఖను రూపొందించారని నమ్మించే ప్రయత్నం చేసారని సీఐడీ విచారణలో తేలడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దీంతో మొదటినుండి వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా నిమ్మగడ్డ లేఖ టీడీపీ కార్యాలయంలోనే తయారయిందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తొలగించటం గురించి హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆయన రాసిన లేఖ తన అధికారిక కార్యాలయంలో తయారైంది కాదని తేలడంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Show comments