Idream media
Idream media
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ అంశాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పోలీసులకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది.ఈ కేసుపై అత్యవసర దర్యాప్తునకు ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని ఎన్‌హెచ్‌ఆర్సీ అభిప్రాయపడింది. వాస్తవాలను తెలుసుకునేందుకు ఒక బృందాన్ని పంపాలని డీజీపీకి ఆదేశించింది. అంతేకాదు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి నిజ నిర్ధారణ టీమ్‌ను పంపాలని ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌పై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్సీ పేర్కొంది. శనివారం ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధులు పరిశీలించిన తర్వాతే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.
కాగా, మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి అధికారులు ఫ్రీజర్ బాక్సులను తరలించారు. ఈరోజు రాత్రికి ఆస్పత్రిలోనే దిశ నిందితుల మృతదేహాలను భద్రపరుస్తారు. ఇప్పటి వరకు మృతదేహాలను బంధువులకు అప్పగించలేదు. దీంతో ఇవాళ అంత్యక్రియలు జరిగే అవకాశం లేనట్లేనని చెబుతున్నారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాముహిక ఖననానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తుండగా, మరో వైపు కుటుంబ సభ్యులు తమ కు అప్పగించాలని పట్టు పడుతున్నారు.