iDreamPost
iDreamPost
రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఎన్నికల కమిషనర్ చేయని పనిని ప్రస్తుత కమిషనర్ నిమ్మగడ్డ చేసేందుకు సిద్ధపడ్డారు. అర్హత ఉన్న ప్రతి ఓటరును తనకున్న ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడం ఎన్నికల కమిషనర్ ప్రధానమైన కర్తవ్యం. ఎదుటి వారి విధులు, కర్తవ్యాలను ఎత్తిచూపుతున్న నిమ్మగడ్డ తను నెరవేర్చాల్సిన ముఖ్య కర్తవ్యానికి మట్టుకు మినహాయింపులు ఇచ్చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ అంటూ హడావిడి పడుతున్న నిమ్మగడ్డ ఏపీలోని దాదాపు మూడున్నర లక్షల మందికిపైగా ఓటర్లకు ఓటు హక్కు లేకుండానే చేసేస్తున్నారు.
2021 ఓటరు జాబితాను అనుసరించి ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, అందుకు భిన్నంగా 2019 ఎన్నికల జాబితా ప్రకారం ఎన్నికలకు వెళుతున్నట్లు ప్రకటించారు. కోర్టుకు సైతం 2021 ఎన్నికల జాబితా ప్రకారమే ఎన్నికలకు వెళతామని చెప్పారు. కానీ అమలులోకి వచ్చేసరికి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నిమ్మగడ్డ తీసుకున్న ఈ హడావిడి నిర్ణయం కారణంగా లక్షలాది మంది ఓటర్లు తమకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
నిర్ణయం ఆయన తీసేసుకుని.. నెపాన్ని మాత్రం ప్రభుత్వ శాఖలపైకి నెట్టేసేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు. ఇన్ని లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితికి కారణంగా పంచాయతీరాజ్‌శాఖను చూపడం ఇప్పుడు ఆ శాఖఉద్యోగుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ఓటరు జాబితా తయారీ ప్రక్రియ మంత్ర దండం నుంచి ఊడిపడిపోదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సంబంధిత దరకాస్తులను పరిశీలించి, తుది ఓటరు జాబితాను సిద్ధం చేయాల్సి ఉంటుందంటున్నారు.
కోవిడ్ ప్రారంభమైంది మొదలు వైద్య శాఖ సిబ్బందితో పాటు పంచాయతీరాజ్, పోలీసు, రెవిన్యూ వ్యవస్థలు అహర్నిశలు పాజిటివ్ రోగులను గుర్తించేందుకు శ్రమించారు. రోగులను గుర్తించాక వారికి చికిత్స అందించడం, వారుండే ప్రాంతాల్లో కంటైన్మెంట్‌జోన్లు ఏర్పాటు చేయడం తదితర కార్యక్రమాలను ప్రాణాలకు తెగించి మరీ చేపట్టారు. ఈ క్రమంలోనే పలువురు కోవిడ్ భారిన పడ్డారు. ఇంకొందరు మృత్యువుపాలయ్యారు.
అయితే లేడికి లేచిందే పరుగన్న రీతిలో నిమ్మగడ్డ ఇప్పటికిప్పుడు హఠాత్తుగా ఎన్నికలు అని ప్రకటించేసారు. నేను ఎన్నికలు పెడతానంటే కొత్త ఓటరు జాబితాలు ఇవ్వరా అంటూ వారిపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా సంబంధిత పంచాయతీరాజ్ శాఖ బాధ్యులపై తగిన సమయంలో చర్యలు కూడా తీసుకుంటామని హూంకరిస్తున్నారు. అయితే ఎవరిపైనో కక్షను తమపై చూపడం ఎంత వరకు సమంజసమన్న భావన పంచాయతీరాజ్ ఉద్యోగుల వైపునుంచి బలంగానే విన్పిస్తోంది. కోవిడ్ విధులు, గ్రామాల్లో పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాల సర్వేలు, వాటి అమలు.. తదితర విధులతో తామంతా తీవ్ర ఒత్తిడిలో ఉద్యోగాలు చేస్తున్నామని. తమకు ఏ మాత్రం సమయం ఇవ్వకుండా ఇప్పటికిప్పుడే అన్నీ తీసుకు వచ్చేయాలనడం ఎంత వరకు సమంజసమని సూటిగానే ప్రశ్నిస్తున్నారు. గ్రామ స్థాయిలో కీలకమైన పంచాయతీరాజ్ వ్యవస్థలోని సిబ్బందిని చిన్నబుచ్చే విధంగా నిమ్మగడ్డ వ్యాఖ్యలు చేయడం పట్ల వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల నిర్వహణలో ఓటరు జాబితా ఎంతో కీలకమైనదని, పాత ఓటరు జాబితాతో ఎన్నికలకు వెళితే, 2019 తరువాత కొత్తగా ఓట్లు పొందిన దాదాపు మూడున్నర లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతారని వివరిస్తున్నారు. ఒక వేళ ఇదే జరిగితే నిమ్మగడ్డ చెబుతున్న రాజ్యాంగ బద్దమైన విధి నిర్వహణ.. పంచాయతీ పాలన మెరుగు పర్చడం.. ఇటువంటి సూక్తులను తనకుతానే ఉల్లంఘించినట్టవుతుందంటున్నారు. ఇన్ని లక్షల మందికి ఓటు హక్కును దూరం చేసి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఆయన నిర్వర్తించే బాధ్యత ఏంటంట అన్న ఎత్తిపొడుపులు కూడా విన్పిస్తున్నాయి.
కొసమెరుపు ఏంటంటే.. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమిలో యువ ఓటర్లు కీలకపాత్రే పోషించారంటారు. అప్పట్లో ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ ఇష్టమొచ్చిన హామీలన్నీ ఇచ్చిన చంద్రబాబు పట్ల ఉన్న అన్ని తెరలు పటాపంచలు కావడంతో యువత మొత్తం వైఎస్ జగన్మోహనరెడ్డివైపు మొగ్గినట్లుగా చెబుతుంటారు. దీంతో అనూహ్యమైన విజయాన్ని జగన్ దక్కించుకున్నారు. తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ యువతకు అన్ని విధాలా పెద్దపీఠ వేస్తున్నారు. సచివాలయాల్లో ఉద్యోగాలు, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు, రేషన్ ట్రక్కుల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం తదితర చర్యల ద్వారా తనకు అండగా నిలిచిన యువతకు భరోసాగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే యువ ఓటర్లను స్థానిక సంస్థల ఎన్నికల నుంచి దూరంగా ఉంచే ఆలోచనతోనే ఇప్పుడు 2019 ఓటర్ల జాబితాను తెరపైకి తెస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం చేసే వారు కూడా లేకపోలేదు. పంచాయతీ రాజ్ శాఖకు కొంచెం సమయం ఇచ్చి 2021 జాబితాతో నిమ్మగడ్డ ఎన్నికల ప్రయత్నాలకు వెళితే ఇటువంటి అనుమానాలకు ఆస్కారమే ఉండేది కాదాయె.