Idream media
Idream media
కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ గమనించ లేదనుకుంటుందట.. అలా ఉంది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యవహార శైలి. ‘‘మేమంతా ఐకమత్యంగా పని చేస్తుండటంతో జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విసిరిన సవాల్‌కు తోక ముడిచావు. చంద్రబాబు సభపై రాళ్లు వేయించావు. నా సంభాషణల్ని వక్రీకరించావు. ఎన్ని విష పన్నాగాలు పన్నినా టీడీపీ విజయాన్ని ఆపలేవు. నారా లోకేశ్‌తో నాకున్న అనుబంధాన్ని విడదీయలేవు. నీ దొంగ మీడియా వీడియోలు ఏమీ చేయలేవు’’ ట్విట్టర్ వేదికగా వైరల్ వీడియోపై అచ్చెన్నాయుడు స్పందించిన తీరు ఇది. అలాగే ప్రభుత్వంపైన, జగన్ పైన మండిపడ్డారు. అయితే ఇప్పుడు ఆ వీడియోలో ఉన్న ఓ వ్యక్తి బయటకు వచ్చి స్వయాన ఆయనే పోలీసులకు ఫిర్యాదు చేయడం టీడీపీకి మరో షాక్.
అచ్చెన్నాయుడు ఓ టీడీపీ నేతతో జరిపిన అంతరంగిక సంభాషణ ఇప్పుడు టీడీపీలో గుబులు రేపుతోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో తనపై రాళ్లదాడి జరిగిందని సానుభూతి పొందాలనుకున్న బాబుకు ఈ వీడియో శరాఘాతంగా మారింది. చంద్రబాబు టీడీపీ శ్రేణులకు ఇప్పుడు అచ్చెన్న వీడియో ఇబ్బందికరంగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. అచ్చెన్నా.. మరో టీడీపీ నేత టీడీపీలో భవిష్యత్ లేదని.. లోకేష్ ఉన్నంత కాలం పార్టీ బాగుపడదని అన్నట్టున్న వీడియో బయటడడం పార్టీ భవిష్యత్ ను గందరగోళంలో పడేసిందన్న చర్చ సాగుతోంది. ఈ వీడియో బయటపడడంతో అచ్చెన్నతో మాట్లాడిన వీడియోలో లోకేష్ గురించి అనుచితంగా మాట్లాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆకుల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి వెంటనే తిరుపతి వెస్ట్ పోలీసులను ఆవ్రయించాడు. తనకు టీడీపీ నుంచి చంద్రబాబు నుంచి ప్రాణాహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అచ్చెన్నతో తాను జరిపిన వీడియో లీక్ అయినప్పటి నుంచి తనకు టీడీపీ ముఖ్య నేతల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను జూబ్లిహిల్స్ నుంచి కార్పొరేటర్ గా పోటీచేశానని తెలిపారు. 30 ఏళ్లుగా తాను టీడీపీలో కష్టపడి పనిచేశానన్నాడు. చంద్రబాబు అచ్చెన్నాయుడులకు అత్యంత సన్నిహితుడైన కేఎల్ నారాయణ అనే వ్యక్తి జూబ్లిహిల్స్ లోని 400 గజాల స్థలాన్ని కబ్జా చేశాడని ఆకుల వెంకటేశ్వరరావు ఆరోపించారు. దీనిపై చంద్రబాబుకు బాలకృష్ణకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని సంచలన ఆరోపణలు చేశారు. ఇదే విషయంపై అచ్చెన్నాయుడితో మొర పెట్టుకున్నానని వీడియోలో అది రికార్డ్ అయ్యిందని బాధితుడు వెంకటేశ్వరరావు తెలిపారు. వెంకటేశ్వరరావు చెప్పిన దానిని బట్టి ఆ వీడియో, అందులోని అచ్చెన్న వ్యాఖ్యలు నిజమే అన్నట్లుగా ఉంది. మరి దొంగ వీడియో, వక్రీకరణ అంటూ చెప్పిన అచ్చెన్న దీనిపై ఇప్పుడెలా స్పందిస్తారో..!