iDreamPost
iDreamPost
నిన్న సాయంత్రం ఉన్నట్టుండి బుక్ మై షో లాంటి యాప్స్ మీద నైజామ్ డిస్ట్రిబ్యూటర్లు యుద్ధం ప్రకటించేసి ఇకపై ఆన్ లైన్ టికెట్లు ఉండవని కేవలం కౌంటర్ల వద్ద ప్రేక్షకులు తీసుకోవాలని చెప్పడం పెద్ద దుమారం రేపింది. భీమ్లా నాయక్ విడుదలకు కేవలం అయిదు రోజులు మాత్రమే సమయం ఉన్న ఇలాంటి సిచువేషన్లో ఇలా చేయడం పట్ల అభిమానులు టెన్షన్ పడుతున్నారు. దీని వెనుక కారణాలు ఏమైనప్పటికీ జనాలు కరెంట్ బుకింగ్ లో చేతులు పెట్టి టికెట్లు కొనడం ముఖ్యంగా మల్టీ ప్లెక్సుల్లో చాలావరకు తగ్గిపోయింది. సమయం ఆదా చేసుకోవడం కోసమో లేదా కోరుకున్న సీట్లు దక్కించుకోవడం కోసమే దాని కోసం ఛార్జీలు పడుతున్నా పెద్దగా పట్టించుకోలేదు.
11 శాతం దాకా టికెట్ ధరల మీద కన్వీనియన్స్ ఛార్జ్ తీసుకోవడం పట్ల పంపిణీదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకాలం లేనిది ఇప్పటికిప్పుడు ఈ ఇష్యూ ఎందుకు బయటికి వచ్చిందనేది అంతు చిక్కడం లేదు. సరే వీర ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునో లేదా క్యూలలో గంటల తరబడి టికెట్లు కొనడమో చేస్తారు. కానీ కుటుంబ ప్రేక్షకులకు అలా సాధ్యం కాదుగా. థియేటర్ దాకా వచ్చి తీరా హౌస్ ఫుల్ బోర్డు ఉంటే మళ్ళీ వచ్చే సాహసం చేస్తారా. అదే ఆన్ లైన్ బుకింగ్ అయితే ధైర్యంగా టికెట్ చేతిలో ఉంటుంది కాబట్టి ఎంత వ్యయ ప్రయాసలైనా సరే భరించి మరీ హాలు దాకా వస్తారు. ఇదంతా కౌంటర్ తో అయ్యే పనికాదు.
అలాంటప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచించడం అవసరం. ఒకవేళ బుక్ మై షో లాంటి యాపులు దోపిడీ చేస్తున్నాయి అనుకుంటే ఫిలిం ఛాంబర్ తరఫునో లేదా డిస్ట్రిబ్యూటర్ల సమాఖ్య నుంచో ఒక స్వంత ప్లాట్ ఫార్మ్ ని డెవలప్ చేసుకుని అప్పుడు అమ్మే ఆలోచన చేసుండాల్సింది. కానీ అదేమీ లేకుండా వంద కోట్ల బిజినెస్ తో ముడిపడిన భీమ్లా నాయక్ ని దగ్గర పెట్టుకుని ఇలా చేయడం అంటే ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. లోపాయకారి ఒప్పందాల్లో ఏదో తేడా రావడం వల్లే ఈ గొడవ ముదిరిందని అంటున్నవాళ్ళు లేకపోలేదు. ఏదైనా వీలైనంత త్వరగా గంటల్లో దీనికి పరిష్కారం దక్కపోతే చిక్కులు తప్పవు
Also Read : Valimai : అజిత్ సినిమాకు ఎన్ని చిక్కులో