iDreamPost
iDreamPost
‘ఆట మొదలైంది.. ఇది ముగింపు ఆట’.. పశ్చిమ బెంగాల్లో రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని మోదీ నోటి నుంచి వెలువడిన మాటలివి. ‘ఆట వారు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’.. అంటూ ఆయన తన ప్రసంగాలతో అధికార తృణమూల్ కాంగ్రెస్ తుర్పారబట్టారు. ఎన్నికలకు దాదాపు ఆరునెలల ముందునుంచే మాటల తూటాలు పేలుతున్నాయి. నినాదాలు హోరెత్తుతున్నాయి. వీటిలో ‘ఆట మొదలైంది’ అన్న నినాదం షాట్ గన్ లా పేలుతోంది. విశేష ఆదరణతో జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోతోంది. అన్ని పార్టీలదీ ఇదే నినాదం. ఎవరికివారు తమకు అనుకూలంగా వర్తింపజేసుకుంటూ ఈ నినాదానికి అనుబంధంగా పాటలు కూడా రూపొందించి జనం లోకి వదులుతున్నారు. సాక్షాత్తు ప్రధాన మంత్రే దీన్ని వాడేసుకున్నారంటే. ఎన్నికల్లో ఇది ఎంత ప్రభావం చూపుతోందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ నినాదం పుట్టుక.. పరిణామ క్రమం కూడా ఆసక్తికరమే.
బాంగ్లాదేశ్ నుంచి దిగుమతి
అసలు ఈ నినాదం ఇక్కడిది కాదు. బాంగ్లాదేశ్ నుంచి మనకు దిగుమతి అయ్యింది. ఆ దేశానికి చెందిన అవామీ లీగ్ ఎంపీ షమీమ్ ఉస్మాన్ చాన్నాళ్ల క్రితం ఈ నినాదాన్ని ఎత్తుకున్నారు. బెంగాలీ భాషలో ఖేలా హొబ్బే అంటూ ఆయన చేసిన ఈ నినాదానికి అర్థమే ‘ఆట మొదలైంది’. అఖండ భారత దేశంలో ఒకప్పుడు భాగంగా ఉన్న తూర్పు బెంగాల్ నేటి బంగ్లాదేశ్ కావడం.. పశ్చిమ బెంగాల్ కు ఆనుకొని ఉండటంతో అది బెంగాల్ లోకి ప్రవేశించింది. తృణమూల్ కాంగ్రెస్ బీర్ భూమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మండల్ మొదట దాన్ని అందిపుచ్చుకున్నారు. దాంతో అది తృణమూల్ ఎన్నికల నినాదంగా మారింది. పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీతో సహా నాయకులందరూ ఎన్నికల కార్యక్రమాల్లో దీన్ని విరివిగా వినియోగిస్తున్నారు. మొదట ఈ నినాదాన్ని తప్పు పట్టిన బీజేపీ చివరికి తాను కూడా ఆ నినాదంపై ఆధారపడకతప్పలేదు. ఎరువు నినాదంగా విమర్శించిన ఆ పార్టీ.. తర్వాత తనకు ఆనుకూలంగా మార్చి వాడుకుంటోంది. ఆ పార్టీ బెంగాల్ విభాగం అధ్యక్షుడు దిలీప్ ఘోష్ దీనికి అదనపు పదాలు జోడించి ‘ఆట మొదలైంది.. మార్పు వస్తుంది’ అంటూ నినదించడంతో ఇది మరింత పాపులర్ అయ్యింది.
పాట రూపంలోనూ..
ఇన్నాళ్లు నినాదంగా హోరెత్తిన ఆట మొదలైంది.. ఇప్పుడు పాట రూపం సంతరించుకుంది. ప్రస్తుత ఎన్నికలను స్థానికులకు, బయటి శక్తులకు మధ్య జరుగుతున్న పోరాటంగా అందులో అభివర్ణించారు. కమలం పార్టీ నిర్వహిస్తున్న ఆపరేషన్ ఆకర్షను అందులో తప్పుపట్టారు. బెంగాల్ కు సొంత బిడ్డే కావాలి అంటూ మమతను బెంగాల్ బిడ్డగా అభివర్ణించారు. మమతా కూడా ఆట మొదలైంది.. నేనే గోల్ కీపర్ ను.. ఎవరు గెలుస్తారో చూద్దాం.. అని సవాల్ చేస్తున్నారు. జైశ్రీరాం, రెండు ఇంజన్ల సర్కార్, కేంద్ర రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం.. వంటి ఎన్నో నినాదాలు ఎన్నికల్లో వినిపిస్తున్నా.. ‘ఆట మొదలైంది’ ముందు అవన్నీ దిగదుడుపుగా మారుతున్నాయి.