Idream media
Idream media
అమరావతి ల్యాండ్ స్కాం, ఈఎస్‌ఐ స్కాం, ఏపీ ఫైబర్ నెట్ స్కాంల సరసన టీడీపీ హయాంలో జరిగిన మరో స్కాం వెలుగులోకి వచ్చింది. విద్యుత్ శాఖలో జరిగిన ఈ స్కాంలో 41 కోట్ల రూపాయలు జేబుల్లో వేసుకున్నారు. ఈ మొత్తం తతంగంపై విచారణ చేసిన విజిలెన్స్ విభాగం నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా విద్యుత్ శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తదుపరి చర్యలకు ఉపక్రమించారు.
టీడీపీ హాయంలో విద్యుత్ శాఖలో మీటర్ల కొనుగోళ్లలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని విజిలెన్స్ విభాగం తేల్చింది. 41 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని నివేదికలో పొందుపరిచింది. విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదిక ప్రకారం ఏపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు (సీఎండీ)గా పని చేసిన గోపాల్ రెడ్డి, రంగనాథంలతో కలిపి మొత్తం 12 మందిపై కేసులు నమోదు చేయాలని నాగులాపల్లి శ్రీకాంత్.. ప్రస్తుత సీఎండీ హరనాథ్‌బాబుకు రాతపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు.
ఇద్దరు మాజీ సీఎండీలతోపాటు మాజీ చీఫ్ జనరల్ మేనేజర్లు ఎ.చిన్నయ్య, ఎ. వేణుఓపాల్, టి.హనుమంత ప్రసాద్, కె.ప్రకాశ్(ఆడిట్), సీనియర్ అకౌంట్స్ అధికారి బి.సుబ్రమణ్యం, మాజీ డైరెక్టర్లు ఆనంద్(ఆపరేషన్స్), దామోదర్‌రావు(ఫైనాన్స్), జనరల్ మేనేజర్లు ఆర్.శ్రీనివాసులు, ఎం. విజయ్‌కుమార్, పే అధికారి వై.లక్ష్మీనరసయ్య ఉన్నారు. ప్రస్తుతం వీరు సర్వీస్‌లో లేరు. ఉద్యోగ విరమణ చేశారు. జరిగిన నష్టం 41 కోట్ల రూపాయలను ఈ 13 మంది నుంచి రికవరీ చేయాలని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్.. సీఎండీకు ఆదేశాలు జారీ చేశారు.
ఇంధన శాఖ కార్యదర్శి ఆదేశాలతో ఈ 13 మందిపై కేసులు నమోదు చేస్తే.. ఈ స్కాంలో ఇంకా మరింత సమాచారం వారి నుంచి వస్తుందని భావిస్తున్నారు. ఇంత పెద్ద స్కాంను రాజకీయ నేతల అండ లేకుండానే, వారికి తెలియకుండానే అధికారులు చేసి ఉంటారా..? అనే అనుమానాలు ఉన్నాయి. అప్పటి విద్యుత్ శాఖ మంత్రిగా కళా వెంకటరావు పని చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యుత్ మంత్రి కళా వెంకటరావు, ఇతర రాజకీయ నేతలకు తెలియకుండానే అధికారులు ఈ అక్రమాలకు పాల్పడ్డారా..? లేదా..? అనేది వారిపై కేసులు నమోదు చేసి, 41 కోట్లు రికవరీ చేసే సమయంలో తెలిసే అవకాశం ఉంది.