Dharani
Dharani
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మర్యాదగా చెప్పినా.. మందు తాగితే పోతారు అని హెచ్చరించినా సరే.. మందుబాబులు మాత్రం మారరు. ఉన్నన్ని రోజులు తాగి ఇంటిని, ఒంటిని గుల్ల చేస్తారు. ఆ తర్వాత అనారోగ్యంపాలై.. ఆస్పత్రిలో చేరితో అప్పడు మళ్లీ లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. దురదృష్టం కొద్ది.. మంచానికే పరిమితమైనా, చనిపోయినా.. ఇక ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణానాతీతం. ఇన్ని అనర్థాలకు మూల కారణం మద్యం అని తెలిసినా మానుకోరు. ఇక మందు తాగడం వల్ల క్యాన్సర్, కాలేయానికి సంబంధించిన వ్యాధులు వస్తాయిని అందరికి తెలుసు. కానీ తాజాగా ఓ నివేదిక షాకింగ్ విషయాలు వెల్లడించింది. మద్యం సేవించడం వల్ల వందల రోగాలు పుట్టుకొస్తాయని.. ఒక్క పెగ్గు కూడా అనేక రోగాలకు కారణం అవుతుందని నివేదిక వెల్లడించింది.
ఆక్స్‌ఫర్డ్ పాపులేషన్ హెల్త్, చైనాకు చెందిన పెకింగ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు చైనా కడూరీ బయోబ్యాంక్ చేసిన రీసెర్చ్ డేటాను ఉపయోగించి, పరిశోధనలు చేశారు. ఇది 2004-2008 మధ్యకాలంలో చైనా అంతటా పది విభిన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి సుమారు 5,12,000 మంది పెద్దలను ఎన్నుకుని.. వారిపై గత 12 ఏళ్లుగా పరిశోధనలు చేసి ఈ నివేదక వెల్లడించారు. ఈ అధ్యాయనంలో పాల్గొన్నవారిలో సుమారు 98 శాతం మంది పురుషులు కాగా.. 2 శాతం మంది మహిళలు. ఈ పరిశోధనలో.. మద్యపానం వల్ల అనేక జబ్బుల బారిన పడే అవకాశం ఉందని వెల్లడైంది. ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించినప్పటికీ 60 కంటే ఎక్కువ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని రిపోర్టులో వెల్లడైంది.
ఇందులో ముఖ్యంగా కంటిశుక్లం, గ్యాస్ట్రిక్ అల్సర్లు వంటి అనేక వ్యాధులు ఉన్నాయి. 200 కంటే ఎక్కువ వ్యాధులపై మద్యపానం, దాని ప్రభావాలను అంచనా వేసినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నేచర్ మెడిసిన్‌లో ప్రచురించిన నివేదికల ప్రకారం.. సుమారు 207 వ్యాధులకు పరోక్షంగా, 61 వ్యాధులకు ప్రత్యక్షంగా మద్యపానం కారణమవుతుంది అని నివేదిక తెలిపింది. గౌట్, ఫ్రాక్చర్స్, క్యాటరాక్ట్, గ్యాస్ట్రిక్ అల్సర్ వంటి ఆల్కహాల్ సంబంధితంగా గతంలో గుర్తించబడని 33 వ్యాధులు కూడా ఉన్నాయని నేచర్ మెడిసిన్ జర్నల్ జూన్ 8న ప్రచురించింది.
ఈ కొత్త అధ్యయనం ఎంతో కీలకమైనదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. తాజా అధ్యాయనం.. జనాభాలో విస్తృతమైన వ్యాధులపై మద్యపానం ప్రభావాన్ని అంచనా వేస్తుంది అన్నారు శాస్త్రవేత్తలు. అధిక మద్యపానం వల్ల కలిగే సిర్రోసిస్, స్ట్రోక్, కొన్ని క్యాన్సర్‌లు మాత్రమే కాకుండా గతంలో మద్యపానంతో సంబంధం లేని వ్యాధులపై కూడా ప్రస్తుతం మద్యం ప్రభావం చూపించినట్లు ఈ నివేదికలో తేలింది.