Idream media
Idream media
రాజధాని తరలింపుతో తమ భూముల ధరలు తగ్గిపోతాయని, తమ ఆశలు అడియాసలు అవుతాయని ఆందోళన చెందుతున్న అమరావతి పరిసర ప్రాంత రైతులకు, ప్రజలకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మొదటి నుంచీ చెబుతున్నట్లుగానే.. అమరావతికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రాజధాని అమరావతిని నగరపాలక సంస్థగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. అమరావతి ని కార్పొరేషన్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా రాజధానిలోని 19 గ్రామాలను ఈ కార్పొరేషన్ పరిధిలో చేర్చనున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను సేకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తుళ్ళూరు మండలంలోని 16 గ్రామాలను అమరావతి మున్సిపల్ సిటీ కార్పొరేషన్ ACCMCలో విలీనం చేసేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేయమని కలెక్టర్‌ను ఆదేశించింది ప్రభుత్వం. దాని ప్రకారమే నోటిఫికేషన్ ఇచ్చారు గుంటూరు జిల్లా కలెక్టర్. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఏపీకి మూడు రాజధానులను ప్రకటిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు బిల్లు కూడా రూపొందించారు. ఈ ప్రకటన అమరావతిలోని కొందరి రైతుల్లో ఆందోళన రేకెత్తించింది.
రాజధాని కావడంతోనే తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చామని, ఇక్కడి నుంచి రాజధానిని తరలిస్తే నష్టం వాటిల్లుతుందని భావించారు. ఇదే అదునుగా ప్రతిపక్షాలు దీనిపై గందరగోళం సృష్టించాయి.ఈ మేరకు రాజధాని తరలింపును అడ్డుకుంటూ ఉద్యమం మొదలైంది. న్యాయస్థానాల్లో కేసులు దాఖలయ్యాయి.బిల్లులోని లోపాలతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని గుర్తించిన ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుంది. త్వరలోనే పక్కాగా మరో బిల్లును తేనున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలోనే మూడు రాజధానుల బిల్లులను రాష్ట్ర అసెంబ్లీలో ఉపసంహరించుకున్న జగన్ ప్రభుత్వం కొంతకాలంగా సైలెంట్‌గా ఉంది. ఇప్పుడు అమరావతి ప్రాంత ప్రజలకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతాన్ని నగరపాలక సంస్థగా ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాజధాని నగరం పేరుతో కార్పొరేషన్‌గా మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.రాజధానిలోని 19 గ్రామాలను అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్‌గా మార్చనున్నారు. ఈ మేరకు గ్రామ సభల నిర్వహణకు గుంటూరు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తుళ్లూరు మండలంలో 16, మంగళగిరి మండలంలోని 3 గ్రామాల్లో సభలు నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని సంబంధిత అధికారులను గుంటూరు కలెక్టర్ ఆదేశించారు. దీంతో త్వరలోనే అమరావతి ప్రాంతంలోని 19 గ్రామాలు క్యాపిటల్ సిటీగా మారనున్నాయి. ఆ ప్రాంత గుర్తింపు, విలువ రెట్టింపు కానున్నాయి.
Also Read : లఖింపూర్ ఖేరీ రైతుల మరణాలు : ప్రమాదం కాదు.. కుట్ర అని తేల్చిన సిట్