Idream media
Idream media
కరోనా వైరస్ చికిత్స కోసం దేశీయ ఫార్మా దిగ్గజ సంస్థ గ్లెన్‌మార్క్ ఔష«ధాన్ని ఆవిష్కరించిన కొద్ది గంటల్లోనే మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ఇంజక్షన్ రూపంలో ఉండే ‘రెమిడెసివిర్’ ఔషధాన్ని భారత్‌లో తయారు చేసి, మార్కెటింగ్ చేసేందుకు అమెరికాకు చెందిన గెలిడ్ సైన్సెస్‌తో దేశీయ ఫార్మ కంపెనీలు హెటిరో, సిప్లాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఔషధం తయారీ, మార్కెటింగ్‌కు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా(డీసీజీఏ) అనుమతులు మంజూరు చేసింది.
త్వరలో దేశీయంగా ఈ ఔషధాన్ని హెటిరో, సిప్లా సంస్థలు తయారు చేసి విక్రయాలు చేపట్టనున్నాయి. కరోనా బారిన పడి తెలికపాటి, లేదా ఓ మోస్తరు స్థాయిలో బాధపడుతున్న వారికి పరిమిత అత్యవసర వినియోగం కోసం రెమిడెసివిర్ వినియోగించేందుకు డీసీజీఏ అనుమతులు మంజూరు చేసింది. ఈ ఔషధం వినియోగించే ముందు ప్రతి రోగి నుంచి రాతపూర్వకంగా అనుమతి తీసుకోవాలని షరతు పెట్టింది. దీంతోపాటు అదనపు క్లినికల్ ట్రయల్స్, మార్కెటింగ్ నిఘా సమాచారం వంటి నివేదిక సమర్పించాలని డీసీజీఏ రెండు ఫార్మ సంస్థలను ఆదేశించింది.
క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్స్ ఫర్ కోవిడ్–19లో భాగంగా అనుమతులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. తీవ్రమైన మూత్రపిండ, కాలేయ వ్యాధులతో బాధపడుతున్న వారికి, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 12 ఏళ్లు లోపు పిల్లలకు ఈ మందు వినియోగించకూడదని అధికారులు తెలిపారు.
ఇంజక్షన్ రూపంలో ఉండే రెమిడెసివిర్ ఔషధాన్ని కరోనా రోగులకు తొలుత 200 ఎంజీ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐదు రోజులపాటు 100 ఎంజీ చొప్పున ప్రతి రోజు ఇవ్వాలని హెటిరో, సిప్లా సంస్థలు తెలిపాయి. అతి త్వరలో ఈ ఔషధం తయారు చేసి మార్కెట్‌లోకి విడుదలు చేయనున్నట్లు తెలియజేశాయి.