iDreamPost
android-app
ios-app

ఆప్ కు షాక్ : దేశ రాజ‌ధానిపై ఇక‌ ఎల్జీకే స‌ర్వాధికారాలు

ఆప్ కు షాక్ : దేశ రాజ‌ధానిపై ఇక‌ ఎల్జీకే స‌ర్వాధికారాలు

కరోనా పంజా విసురుతున్న సమయంలో ఢిల్లీ రాజ‌కీయాల్లో కీల‌క అంశం చోటుచేసుకుంది. ఓ కొత్త చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చింది. ఇక నుంచి ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) దేశ రాజధానికి పాల‌కుడు. పరిపాలనకు సంబంధించిన కీలక అంశాలలో ఎల్జీ చేతికి సంపూర్ణాధికారాలు దఖలుపడ్డాయి. కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం ఇకనుంచి కార్యనిర్వాహక నిర్ణయం ప్రకటించేముందు ఎల్జీ అభిప్రాయాన్ని విధిగా కోరాల్సి ఉంటుంది.

దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ చట్టానికి కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన సవరణను మంగళవారం రాత్రి అమల్లోకి తీసుకువస్తూ కేంద్ర హోంశాఖ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఢిల్లీ పై ఆధిపత్యం కోసం, లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీని పాలించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఎన్నికైన ప్రభుత్వ ప్రణాళికలను అడ్డుకుంటుందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. కరోనా రెండోదశ వ్యాప్తితో సతమతమవుతున్న దేశ రాజధాని ఢిల్లీలో ఈ సమయంలో ఈ చట్టాన్ని అమలుచేయడం చర్చనీయాంశంగా మారింది.

ఒకపక్క కరోనా మహమ్మారి కారణంగా దేశ రాజధానిలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొంది. ఈ సమయంలో ప్రభుత్వ అధికారాలను నిర్వీర్యం చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారాలను పెంచుతూ చేసిన చట్టం అమల్లోకి వచ్చింది. ఒకవేపు కరోనా మళ్లీ విజృంభించి భారీ సంఖ్యలో రోగులు మృత్యువాతపడుతున్న సమయంలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం గమనార్హం. చట్ట సవరణ ప్రకారం ఇక ఢిల్లీలో ప్రభుత్వమంటే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అని అర్థం. ఆయన ఆజ్ఞ లేనిదే ఏదీ నడవదు. ఢిల్లీలో పరిపాలనకు సంబంధించి మూడు కీలక అంశాలు…శాంతి భద్రతలు, పోలీసు వ్యవస్థ, భూ వ్యవహారాలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. వైద్య, విద్య, వ్యవసాయం, అడవులు, రవాణా వంటి రంగాలు ఢిల్లీ సర్కారు పరిధిలో ఉన్నాయి. ఢిల్లీలో పాలనాయంత్రాంగాన్ని ఎల్జీ చేతిలో పెడుతూ చట్టం చేయడంతో ఎన్నికైన సర్కారు ఉత్సవ విగ్రహంలా మారనున్నది.

తన పరిధిలో ఉన్న రంగాలలో నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వం తప్పనిసరిగా ఎల్జీ అనుమతి పొందాల్సి ఉంటుంది. కొవిడ్‌ రోగులకు అవసరమయ్యే ప్రాణవాయువు, మందులు నల్ల బజారుకు తరలకుండా నిరోధించడంలో విఫలమైన కేజ్రీవాల్‌ సర్కారుపై ఢిల్లీ హైకోర్టు మంగళవారం మండిపడింది. ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దలేకపోతే కేంద్రం రంగప్రవేశం చేయాల్సిందిగా ఆదేశిస్తామని కూడా హెచ్చరించింది. ఈ బిల్లు పార్లమెంటులో పాస్ అయినప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీనిని “భారత ప్రజాస్వామ్యంలో విచారకరమైన రోజు” అని అభివర్ణించారు. అరవింద్ కేజ్రీవాల్ ఇది ఢిల్లీ ప్రజలకు “అవమానం” అని మండిపడ్డారు . ప్రజలు ఓటు వేసి గెలిపించిన వారి నుండి అధికారాలను సమర్థవంతంగా లాగేసే ప్రక్రియ అని, ఓడిపోయిన వారికి ఢిల్లీని నడిపించే అధికారాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.