iDreamPost
android-app
ios-app

తాజా మాజీ మంత్రులకు మ‌రో చాన్స్!

తాజా మాజీ మంత్రులకు మ‌రో చాన్స్!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కేబినెట్‌ నుంచి ఒక్కసారే 12 మందికి ఉద్వాసన పలకడం తీవ్ర సంచలనంగా మారింది. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడం, యువతకు, మహిళకు ప్రాధాన్యమివ్వాలన్న ఆలోచనతో కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు శ్రీకారం చుట్టారు. అయితే కొత్త వారి మాటేంటో కానీ, 12 మందిని తొలగించడం, అందులో సీనియర్లు కూడా ఉండడంతో అది తీవ్రస్థాయిలో చర్చకు దారి తీసింది. అది పార్టీలో పెద్ద కుదుపునకు దారి తీసింది. దీంతో తాజా మాజీ మంత్రులకు ఇతర పదవులను కట్టబెట్టే యోచరలో భాగంగా త్వరలో జాతీయ స్థాయిలో పెద్దఎత్తున సంస్థాగత మార్పులు చేయాలని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

తాజా కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణలో మంత్రిపదవులు కోల్పోయిన రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జావడేకర్‌లకు పార్లమెంటరీ బోర్డులో స్థానం కల్పించవచ్చని సమాచారం. వెంకయ్య నాయుడును ఉప రాష్ట్రపతి పదవిలో నియమించిన తర్వాత, అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్‌, అనంత్‌కుమార్‌ దివంగతులైన అనంతరం పార్లమెంటరీ బోర్డులో ఖాళీలను పూరించలేదు. తాజాగా తావర్‌ చంద్‌ గెహ్లోత్‌ను గవర్నర్‌గా నియమించడంతో ఈ బోర్డులో అయిదు ఖాళీలు ఏర్పడ్డాయి. కాగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న భూపేంద్ర యాదవ్‌ను కేంద్ర మంత్రిగా నియమించడంతో ఆయన స్థానంలో ప్రస్తుతం కార్యదర్శులుగా ఉన్న వారిలో ఒకరికి పదోన్నతి కల్పించే అవకాశం ఉంది.

2022లో బిహార్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రవిశంకర్‌ ప్రసాద్‌కు కీలక బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం. అలాగే ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, హిమాచల్‌ ప్రదేశ్‌లో పార్టీని విజయ పథంలోకి నడిపించేందుకు సీనియర్‌ నేతలను ఇన్‌చార్జిలుగా నియమించే అవకాశాలున్నాయి. కాగా మంత్రి పదవులు కోల్పోయిన సదానంద గౌడ, హర్షవర్ధన్‌, రమేశ్‌ పోఖ్రియాల్‌, సంతోష్‌ గంగ్వార్‌లకూ అవకాశాలు లభిస్తాయని, గంగ్వార్‌తో సహా మరొకరిని గవర్నర్‌ పదవుల్లో నియమించవచ్చునని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాజ్యసభలో పార్టీ నేతగా ఉన్న ధర్మేంధ్ర ప్రధాన్‌కు గానీ, ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి గానీ అవకాశం లభించవచ్చునని తెలుస్తోంది. ఈ విధంగా వారిని సంతృప్తి ప‌ర‌చ‌డంతో పాటు పార్టీలో అసంతృప్తి మొద‌లుకాకుండా చూసుకోవాల‌ని మోదీ యోచిస్తున్నార‌ట‌.