iDreamPost
android-app
ios-app

ఎన్నిక‌ల వేళ కాటేసిన క‌రోనా : ప్ర‌మాణ స్వీకారం చేయ‌కుండానే కొత్త కార్పొరేట‌ర్ మృతి

ఎన్నిక‌ల వేళ కాటేసిన క‌రోనా : ప్ర‌మాణ స్వీకారం చేయ‌కుండానే కొత్త కార్పొరేట‌ర్ మృతి

ఏపీ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు తెగ ఉత్సాహం చూపుతున్నారు. క‌రోనా ఇంకా పూర్తి స్తాయిలో తొల‌గిపోలేదు కాబ‌ట్టి ఇప్ప‌ట్లో స‌రికాద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ విష‌య‌మై ఇరుప‌క్షాలు కోర్టుకు వెళ్లాయి. ఆ కేసుల వాద‌న‌లు అలా ఉంచితే.. ఏపీ స్థానిక ఎన్నిక‌ల‌ను ఇప్ప‌ట్లో నిర్వ‌హిస్తే ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని ప్ర‌భుత్వం చెప్పిన ప్ర‌తిసారీ నిమ్మ‌గ‌డ్డ తెలంగాణ‌లో జ‌రిగిన జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల‌ను ఉదాహ‌ర‌ణ‌గా చూపుతున్నారు. అక్క‌డ ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఎన్నిక‌లు పూర్త‌య్యాయంటూ చెప్పుకొస్తుండ‌డం చూస్తూనే ఉన్నాం. ఆ ఎన్నిక‌ల ప్ర‌చారం, విధులు సంద‌ర్భంగా క‌రోనా బారిన ప‌డిన కేసులు ఒక్కొక్క‌టి వెలుగులోకి వ‌స్తున్నాయి. ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేసి అత్య‌ధిక మెజార్టీతో గెలిచిన ఓ కార్పొరేట‌ర్ అయితే ప్రాణాలే కోల్పోయారు.

గ్రేటర్ పరిధిలోని లింగోజిగూడ డివిజ‌న్ నుంచి బీజేపీ కార్పొరేటర్ అభ్య‌ర్థిగా ఆకుల రమేశ్ గౌడ్ రంగంలోకి దిగారు. గెలుపు కోసం అహ‌ర్నిశ‌లూ శ్ర‌మించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో విరివిగా పాల్గొన్నారు. స‌భ‌లు, స‌మావేశాలు విస్తృతంగా నిర్వ‌హించారు. ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. ఫ‌లితాల రోజునే ఆయ‌న‌కు కాస్త న‌ల‌త‌గా అనిపించింది. ఆ మ‌ర్నాడు కొంచెం నీర‌సంగా ఉంటే ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. పాజిటివ్ గా తేలింది. ఎన్నిక‌ల్లో ప్ర‌చారంలో విరివిగా పాల్గొన్నందునే క‌రోనా సోకిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. కొన్ని రోజులు ఇంట్లోనే ఉండి చికిత్స పొందారు. శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు త‌లెత్త‌డంతో ఆస్ప‌త్రిలో చేరారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేస్తున్నారు. 25 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో గురువారం సాయంత్రం కన్నుమూశారు. గతంలో ఎల్బీనగర్ మున్సిపల్ ఛైర్మన్ గా వ్యవహరించిన రమేశ్ గౌడ్.. కార్పొరేటర్ గా గెలిచి.. ప్రమాణస్వీకారం చేయకుండానే మరణించటం అయ్యో అనిపించేలా చేసింది. ఆరోగ్యంగా ఉండే ఆయన్ను మాయదారి ఎల‌క్ష‌న్లు వ‌చ్చి బలి తీసుకున్నాయ‌ని కుటుంబ స‌భ్యులు వాపోతున్నారు. ఎన్నిక‌లే లేక‌పోతే ఇంట్లోనే ఉండేవార‌ని ఆయ‌న అనుచరులు చెబుతున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు కూడా చాలా మంది క‌రోనా బారిన ప‌డ్డారు. సెంట్ర‌ల్ జోన్ ప‌రిధిలోని ఓ పోలీస్ స్టేష‌న్ లో 5గురు సిబ్బందికి వైరస్ సోకిన‌ట్లు ఇటీవ‌ల బ‌య‌ట‌ప‌డింది. వారిలో ముగ్గురికి రెండో సారి కావ‌డం మ‌రింత క‌ల‌క‌లం రేపుతోంది. సైబ‌రాబాద్ ప‌రిధిలో మ‌రో 23 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. రాచ‌కొండ‌లో 14 మంది పోలీసులు క‌రోనా బారిన ప‌డిన‌ట్లు తెలుస్తోంది. కొంత మందికి వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేదు. ప‌రీక్ష‌లు చేయించుకుంటే బాధితుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 1949 మందికి కరోనా పరీక్షలు చేయగా 65 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వారిలో 14 మంది పోలీసులు ఉన్న‌ట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఇటీవ‌ల చేస్తున్న ప‌రీక్ష‌ల్లో పోలీసుల సంఖ్య ఉంటోంద‌ని వెల్ల‌డిస్తున్నారు.