iDreamPost
android-app
ios-app

ఎన్టీఆర్ అభిమానుల కల నెరవేర్చిన జగన్

ఎన్టీఆర్ అభిమానుల కల నెరవేర్చిన జగన్

ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న కొత్త జిల్లాల ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్ళింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పరిపాలన సౌలభ్యం,అలాగే అభివృద్ధి అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మొత్తం 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గా త్వరలోనే రూపాంతరం చెందుతుంది. ఈ కొత్త జిల్లాల అడుగు లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణా జిల్లాను రెండు జిల్లాలు గా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం… విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో నందిగామ, తిరువూరు, విజయవాడ రానున్నాయి. సీఎం జగన్ పాదయాత్ర సందర్భంగా కృష్ణాజిల్లాలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబునాయుడు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా సరే… కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ ఉన్నా సరే ఎప్పుడు కూడా భారతరత్న అనే అంశం గురించి గానీ లేకపోతే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టె అంశం గురించి కానీ పరిశీలించకపోవడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు ఉన్నాయి. 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేశారు. ఇక రాజశేఖర్ రెడ్డి మరణానంతరం 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లా గా పేరు మార్చింది.

ఇవన్నీ చూసినా సరే చంద్రబాబు నాయుడు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా సరే ఎన్టీఆర్ కు సరైన గౌరవం ఇవ్వకపోవడం పట్ల టీడీపీ కార్యకర్తలు కూడా అసంతృప్తితోనే ఉన్నారు. ఎన్టీఆర్ టీడీపీకి చెందిన వ్యక్తి అయినా సరే సిఎం జగన్ ఎక్కడా తగ్గలేదు. సొంత పార్టీ నుంచి వద్దనే అభిప్రాయాలున్నా సరే ఆయన మాత్రం ఈ విషయంలో చెప్పింది చేశారు. త్వరలోనే ఈ జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కానుంది.