Idream media
Idream media
కరోనా కాలంలోనూ ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రోజుకో కొత్త నిర్ణయాలు వెలుగు చూస్తున్నాయి. కొవిడ్ కారణంగా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సభ నిర్వహణలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. త్వరలో వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న ఈ నేపథ్యంలో ఎంపీలు అందరూ విధిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే ప్రకటించారు.
తాజాగా సమావేశాలకు సంబంధించి మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ‘జీరో అవర్’ కూడా కేవలం అరగంట మాత్రమే ఉంటుందని ప్రకటించింది. అంటే ఎటువంటి నోటీసులూ లేకుండా ప్రశ్నించే అవకాశం ఎవరికీ ఉండదన్న మాట. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్య గొంతుకు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ఈ నిర్ణయం లోకసభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ తీసుకున్న నిర్ణయమని తెలిపారు. కోవిడ్ కారణంగానే ఇలా చేయాల్సి వచ్చిందని వివరించారు. అయితే వర్షాకాల సమావేశాలు సజావుగా సాగడానికి ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలను ప్రారంభించింది. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన నేతలతో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ ఫోన్లో సంభాషించారు. సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని రాజ్‌నాథ్ అభ్యర్థించారు.
ప్రతిపక్షాల నిరసనలు
ప్రశ్నోత్తరాల సమయం ప్రజాస్వామ్యానికి, సమావేశాలకు ఆక్సిజన్ లాంటిదని, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పార్లమెంట్ పని దినాలను తగ్గించాలని ప్రభుత్వం చూస్తోందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. పార్లమెంట్ ను ఓ నోటీస్ బోర్డులా, అందర్నీ రబ్బరు స్టాంపులా మార్చాలని చూస్తోందని ఆరోపించారు. పీల హక్కులను అణచివేస్తూ… ప్రభుత్వానికి కావాల్సిన దానిని ఆమోదించుకోడానికి చూస్తున్నారు. జవాబుదారీ తనాన్ని నిర్ణయించే దారిని కూడా మూసేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని స్పీకర్ కు రాజీవ్ శుక్లా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రశ్నోత్తరాల సమయం సమావేశాలకు పెద్ద బలాన్నిచ్చే అంశమని సూచించారు. తృణమూల్ ఎంపీ డెరేక్ ఓ బ్రెయిన్ కూడా ఈ విషయమై స్పందించారు. ‘‘మహమ్మారి మాటున ప్రజాస్వామ్యాన్ని హత్య చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ప్రశ్నోత్తరాల రద్దుతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును మేం కోల్పోతున్నాం. 1950 నుంచి ఇదే మొదట సారి అనుకుంటా. పార్లమెంట్ పని దినాలు కూడా అలాగే ఉన్నాయి. మరి ప్రశ్నోత్తరాలను ఎందుకు రద్దు చేస్తున్నారు? పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి 15 రోజుల ముందే ప్రశ్నలను తెలపాల్సి ఉంటుంది. సమావేశాల్లో 14 నుంచి ప్రారంభం. ప్రశ్నోత్తరాలను ముందే రద్దు చేశారు’’ అని ఓబ్రెయిన్ అన్నారు.