Idream media
Idream media
ఇటీవల నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్ఛేరిలో ప్రభుత్వం ఏర్పాటైంది.
30 మంది ఎమ్మెల్యేలున్న పుదుచ్చేరి శాసనసభకు ఇటీవల వెల్లడైన ఫలితాల్లో రంగస్వామి నేతృత్వంలోని ఎన్‌ఆర్ కాంగ్రెస్ 10 స్థానాలను, బీజేపీ 6, డీఎంకే 6, కాంగ్రెస్ 2, స్వతంత్రులు ఆరు స్థానాలను కైవసం చేసుకున్నారు. సీఎం పదవిపై బీజేపీ, రంగస్వామి మధ్య కాస్త సయ్యాట జరిగినా, చివరకు పుదుచ్ఛేరికి ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రిగా సీనియర్ రాజకీయవేత్త రంగసామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆరేళ్ల తర్వాత మరోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆనందంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన అంతలోనే కరోనా బారిన పడ్డారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే ఆయన వైరస్ బారిన పడ్డారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పుదుచ్ఛేరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్.రంగస్వామి ఇప్పుడు కరోనా బారిన పడిపోయారు. వెరసి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధిలోనే ఆయన చికిత్స కోసమంటూ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరాల్సి రావడంతో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీతో పాటు పుదుచ్ఛేరి అసెంబ్లీకి కూడా ఇటీవలే ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎన్నార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రంగసామి విజయం సాధించారు. అంతేకాకుండా ఆయన పార్టీ తరఫున బరిలోకి దిగిన వారు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించలేకపోయినా… బీజేపీ తరఫున విజయం సాధించిన వారిని కలుపుకుని రంగసామి పుదుచ్ఛేరిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రంగసామి కేబినెట్ లో బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా, ఈ నెల 2న ఫలితాలు వెల్లడైన తర్వాత.. ఈ నెల 7న పుదుచ్ఛేరిలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఇంచార్జీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై. రంగసామితో సీఎంగా ప్రమాణం చేయించారు. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అంత గ్రాండ్ గా చేయలేదు. స్వల్ప సంఖ్యలోనే అతిథులు హాజరయ్యారు. అయినప్పటికీ ఏం జరిగిందో ఏమో, ప్రమాణ స్వీకారం అనంతరం రంగ స్వామి కి స్వల్ప లక్షణాలు కనిపించాయి. దీంతో ముందు జాగ్రత్తగా పుదుచ్ఛేరిలోని ఇందిరాగాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆదివారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. తాజాగా వచ్చిన ఫలితాల్లో ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు నిన్న సాయంత్రమే బయలుదేరి వెళ్లారని అధికారులు పేర్కొన్నారు. కాగా శుక్రవారం ఆయనతోపాటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన 11 మందికి కూడా వైరస్ లక్షణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల సమయంలోను, అవి పూర్తయ్యాక, చివరకు ప్రమాణ స్వీకారంలో కూడా ప్రజాప్రతినిధులను కరోనా వెంటాడుతోంది. తెలుగు రాష్ట్రాలలో నాగార్జున సాగర్, తిరుపతి ఉప ఎన్నికల అనంతరం కూడా పలువురు నాయకులు కరోనా బారిన పడ్డారు. ఇటీవలే తెలంగాణలో జరిగిన మినీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన 8 మంది కార్పొరేటర్ల కు వైరస్ సోకింది. వాళ్లు ఆన్ లైన్ లోనే ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి ప్రమాణ స్వీకారం అనంతరం కరోనా బారిన పడ్డట్టు తెలిసింది.