iDreamPost
android-app
ios-app

మొదటి ‘శ్రీమంతుడు’ బాలకృష్ణే – Nostalgia

  • Published Apr 12, 2020 | 9:32 AM Updated Updated Apr 12, 2020 | 9:32 AM
మొదటి  ‘శ్రీమంతుడు’  బాలకృష్ణే – Nostalgia

ఐదేళ్ల క్రితం వచ్చిన మహేష్ బాబు బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు అందరికి గుర్తే. గట్టి హిట్టు కోసం ప్రిన్స్ ఎదురు చూస్తున్న టైంలో కొరటాల శివ తీసుకున్న ఊరి దత్తత కాన్సెప్ట్ కమర్షియల్ గా బ్రహ్మాండంగా వర్కవుట్ అయ్యింది. తిరిగి ఇచ్చేయాలి లేదంటే లావైపోతాం అనే డైలాగ్ ఎంత పాపులరో చూశాం. అయితే ఇలాంటి స్టోరీ లైన్ తో గతంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేశారంటే నమ్మగలరా. కానీ అది నిజం. ఇది తెలియాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే. 1984లో కళాతపస్వి కె విశ్వనాధ్ గారి దర్శకత్వంలో బాలయ్య హీరోగా ‘జననీ జన్మభూమి’ అనే సినిమా వచ్చింది.

ఇందులో హీరో పేరు రమేష్. ఓ కోటీశ్వరుడి(సత్యనారాయణ) కొడుకు. సర్వ సుఖాలు ఉన్నా ఏదో తెలియని వెలితితో బాధ పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో హీరోయిన్ పద్మిని(సుమలత) వల్ల ఎవరికి చెప్పకుండా స్వంత ఊరికి వెళ్ళిపోయి అక్కడే ఉండి సామాన్య జనంలో సాధక బాధలు తెలుసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. అక్కడికి వెళ్ళాక ప్రతి మంచి పనికి అడ్డుపడే విలన్ అబ్బయ్య నాయుడు (గోకిన రామారావు) ఉంటాడు. మరి రమేష్ కోరుకున్న లక్ష్యం నెరవేరిందా, కొడుకు వెళ్ళిపోయి బాధపడుతున్న హీరో కుటుంబం అతని ఆచూకీ ఎలా కనుక్కుంది లాంటి ప్రశ్నలకు సమాధానం సినిమాలో చూడాలి.

చూశారుగా. మెయిన్ పాయింట్ శ్రీమంతుడుతో ఎంత దగ్గరగా సింక్ అయ్యిందో. జనని జన్మభూమి అప్పట్లో కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. సినిమా ఫలితం ఫ్లాప్. విశ్వనాథ్ గారు కళాత్మకంగా, సందేశాత్మకంగా తీయడంతో కాన్సెప్ట్ జనానికి కనెక్ట్ కాలేదు. అందులోనూ నందమూరి ఫ్యాన్స్ ఆశించే మసాలా అంశాలు ఏవీ ఇందులో లేవు. దీంతో జనని జన్మభూమి కథ పరంగా మంచి విషయాన్నే తీసుకున్నా ఆశించిన ఫలితాన్ని మాత్రం దక్కించుకోలేదు.

దీనికి సుప్రసిద్ధ రచయిత డివిఎస్ నరసరాజు సంభాషణలు సమకూర్చగా మామ కెవి మహదేవన్ సంగీతాన్ని అందించారు. పాటలు బాగుంటాయి. బాలకృష్ణ తల్లిగా శారద చేశారు. అదే తరహా పాత్రను శ్రీమంతుడులో సుకన్య చేశారు. క్యారెక్టర్స్ పరంగా రెండు సినిమాల్లోనూ చాలా పోలికలు ఉంటాయి. జనని జన్మభూమిలో హీరోకు తమ్ముడు(శుభలేఖ సుధాకర్)ఉంటాడు. శ్రీమంతుడులో దాన్ని కొద్దిగా మార్చారు. మొత్తానికి అప్పుడెప్పుడో వర్కవుట్ కానీ కథ 31 ఏళ్ళ తర్వాత కాసుల వర్షం కురిపించడం విచిత్రమే.