iDreamPost
iDreamPost
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన పలు సంక్షేమ పథకాలు , విలేజ్ వలంటీర్ , గ్రామ సచివాలయాల వంటి నూతన వ్యవస్థలు జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందగా తాజాగా మరో రెండు పథకాలు ఆ జాబితాలో చేరాయి .
రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర కోసం ఏర్పాటు చేసిన గిట్టుబాటు ధరల స్థిరీకరణ నిధి పధకం పై , విత్తనం నుండి వ్యవసాయానికి అవసరమైన అన్ని ఉత్పాదకాలు గ్రామ స్థాయిలోనే అందించడమే కాకుండా , పండిన పంట మార్కెటింగ్ చేసుకొనే సౌలభ్యం కూడా అందుబాటులోనే ఉండే విధంగా గ్రామగ్రామాన ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల నిర్వహణ పై నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులు ప్రశంసలు కురిపించారు.
రైతుకి కావాల్సిన నాణ్యమైన విత్తనాలు , కల్తీ లేని ఎరువులు , పురుగు మందులు లాంటి వ్యవసాయ ఉత్పాదకాలు గ్రామ స్థాయిలోనే లభ్యమవటమే కాకుండా వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించటంతో పాటు , పంట నమోదు ద్వారా మార్కెటింగ్ సదుపాయం కూడా అదే గ్రామం నుండి ఆర్బీకే ద్వారా ఏర్పాటు చేయటం ద్వారా రైతుకు ఎనలేని ప్రయోజనం చేకూరుతుందన్నారు.
రాయలసీమ వంటి వర్షాధార ప్రాంతాల్లో పండించే జొన్న , సజ్జ , కొఱ్ఱ , రాగి వంటి చిరుధాన్యాలకు కూడా కేంద్ర వ్యవసాయ శాఖ MSP(మినిమం సెల్లింగ్ ప్రైస్) ప్రకటించాలని , ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం గిట్టుబాటు నిధి పధకం ద్వారా మద్దతు ధర ప్రకటించి అమలు చేస్తున్న విషయాన్ని తాము గమనించామన్న ఆయన జాతీయ స్థాయిలో నాబార్డ్ తో పాటు పలు కేంద్ర సంస్థలు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల పని తీరుని అధ్యయనం చేస్తున్నాయన్న డాక్టర్ చింతల , ఆర్బీకే ల లాంటి గ్రామీణ విజ్ఞాన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడంలో మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ని అనుసరించాలని అభిప్రాయపడ్డారు .
ఆర్బీకేల బలోపేతానికి నాబార్డ్ అన్ని విధాలా సహకరిస్తుందని , గిడ్డంగుల నిర్మాణానికి , పలు ఇతర వ్యవసాయ అభివృద్ధి కార్యకలాపాలకు రెండు తెలుగు రాష్ట్రాలకు రాబోయే రోజుల్లో 68 వేల కోట్ల రుణాలు సహకార సంఘాల ద్వారా ఇవ్వనున్నామని తెలిపారు .