iDreamPost
android-app
ios-app

వైద్య నగరంలో మరో విశిష్ట చికిత్సకు శ్రీకారం

వైద్య నగరంలో మరో విశిష్ట చికిత్సకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య సదుపాయాలు అంటే గుర్తుకు వచ్చేది గుంటూరు నగరం, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో వైద్య సదుపాయాల కల్పనకు గుంటూరు నగరం కేంద్రమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ గుంటూరు నగరంలోనే పలు ప్రముఖ ఆస్పత్రులు ఉన్నాయి. ప్రస్తుతం గుంటూరు మరో విశిష్ట వైద్యానికి కేంద్రం కాబోతోంది. అది కూడా ప్రభుత్వ వైద్యం కావడం రాష్ట్ర ప్రజలకు వరంగా మారబోతోంది.

గుంటూరు సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్‌)లో నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 110 పడకలతో నిర్మించిన క్యాన్సర్‌ ఆస్పత్రిని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. నెలకు 300 నుంచి 400 మంది కొత్త రోగులు, 3000 నుంచి 4000 మంది పాత రోగులకు వైద్యం అందించేలా అన్ని వసతులను ఈ ఆస్పత్రిలో సమకూర్చారు. మెడికల్, సర్జికల్, రేడియేషన్‌ ఆంకాలజీ విభాగాలు ఈ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయి. 50 కోట్ల రూపాయాలతో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రిలో ఏపీ ప్రభుత్వం 17 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా. నాట్కో తన వాటాగా 33 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.

నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌ రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా క్యాన్సర్‌ రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందించబోతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ సేవలు అందనున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలోని క్యాన్సర్‌ బాధితులు మెరుగైన, చవకైన వైద్యం కోసం హైదరాబాద్‌ లేదా చెన్నై నగరాలకు వెళ్లేవారు. ప్రస్తుత ఆస్పత్రి అందుబాటులోకి రావడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే క్యాన్సర్‌ బాధితులకు ఏపీలోనే మెరుగైన వైద్యం అందబోతోంది.