వెలుగు చూడని ‘అధికారం’ – Nostalgia

కొన్ని సార్లు చాలా ఆసక్తి రేపిన సినిమాలు, కాంబినేషన్లు తెరకెక్కకుండానే ఆగిపోవడం అభిమానులను కలవరానికి గురి చేస్తుంది. స్వర్గీయ ఎన్టీఆర్ తో మొదలుకుని ఇప్పటి రామ్, రాజ్ తరుణ్ లాంటి చిన్న హీరోల దాకా ఇలాంటివి ఎన్నో జరిగాయి . కాని ఇది జరిగి ఉంటే బాగుండేది అనిపించేలా ఉన్నా అవి ప్రకటన దశకే పరిమితమవుతాయి. ఇది అలాంటిదే. 1993లో నరేష్ హీరోగా ‘అధికారం’ అనే టైటిల్ తో నరేష్ తానూ నిర్మాతల్లో ఒక భాగంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా ప్రారంభించారు . మెగాస్టార్ చిరంజీవి అతిధిగా రాగా కృష్ణ, విజయనిర్మల సమక్షంలో చాలా గ్రాండ్ గా ఈవెంట్ చేశారు. అభిమానులు కూడా భారీగా తరలి వచ్చారు.

అన్నపూర్ణ స్టూడియోస్ లో కోలాహలంగా జరిగిందీ ఈవెంట్. కాని రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళాక కొద్దిరోజుల తర్వాత ఎందుకో అది ఆగిపోయింది. వెలుగు చూడనే లేదు. కీరవాణి సంగీత దర్శకత్వంలో మ్యూజిక్ సిటింగ్స్ కూడా చేశారు. మణిశంకర్ కు దర్శకత్వ బాధ్యతలు ఇచ్చారు. ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి ప్రవేశించి అందరిని తన చెప్పు చేతల్లోకి తెచ్చుకుని ఆపై శత్రువులను పెంచుకుని తనను చంపే దాకా తెచ్చుకునే ప్రస్థానాన్ని కథగా అధికారం స్క్రిప్ట్ ని రాసుకున్నారు. ఇది కొంత వరకు రానా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ని పోలి ఉంటుంది. నరేష్ కు అప్పటికీ హీరోగా మంచి మార్కెట్ ఉంది.

హాస్య చిత్రాలే ఎక్కువ చేస్తుండటంతో అధికారం లాంటిస్ సీరియస్ చిత్రం మంచి గుర్తింపు తెస్తుందనుకున్నారు అందరూ. కాని చివరికి ఫ్యాన్స్ కోరిక తీరనే లేదు. అప్పట్లో రాజేంద్రప్రసాద్ కు ధీటుగా కామెడీ సినిమాల ద్వారా ఫాలోయింగ్ తెచ్చుకున్న నరేష్ ముఖ్యంగా 90వ దశకంలో చాలా హిట్లు కొట్టారు. బావా బావా పన్నీరు, హైహై నాయక, జంబలకిడి పంబ లాంటి ఎన్నో మర్చిపోలేని చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. జంధ్యాల గారి నాలుగు స్థంబాలాట ద్వారా హీరోగా తెరంగేట్రం చేసిన నరేష్ నిజంగానే అధికారం లాంటి సీరియస్ సబ్జెక్ట్స్ కొన్ని చేసి ఉంటే ఆయనలోని మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అప్పుడే బయటికి వచ్చేవారు. కాని అధికారం బయటికి రాకుండానే చరిత్రలో కలిసిపోయింది.

Show comments