Idream media
Idream media
భూ కబ్జాలు, నేరాలు, అవినీతి, అక్రమాల వ్యహారాలలో పోలీసులు టీడీపీ నేతలపై కేసులు పెట్టిన సమయంలోనూ, వారిని అరెస్ట్ చేసిన సమయంలోనూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంఫై ఫైర్ అవుతూ.. వైసీపీ కార్యకర్తలు, నేతలను బెదిరిస్తుండం ఇటీవల నిత్యం జరుగుతూనే ఉంది. అన్ని రాసిపెట్టుకుంటున్నాం.. వడ్డీతో సహా చెల్లిస్తాం.. చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం.. తోలు తీస్తాం.. లెక్కలు తేలుస్తాం.. ఇలాంటి పదాలు నారా లోకేష్ నోటి నుంచి జాలువారుతున్నాయి. ఈ తరహాలోనే తాజాగా లోకేష్ వైసీపీ శ్రేణులు, నేతలను ఉద్దేశించి మరో హెచ్చరిక చేశారు. టీడీపీకి చెందిన ఉంగుటూరు సర్పంచ్‌పై వైసీపీ శ్రేణులు దాడి చేశారంటూ మండిపడిన లోకేష్.. అధికారంలోకి రాగానే అందరి ఖాతాలు సెటిల్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ సారి లోకేష్ చేసిన హెచ్చరిక మునుపటి కన్నా భిన్నంగా ఉంది. అందరి ఖాతాలు సెటిల్ చేస్తాం.. అంటే.. తమతోపాటు ప్రజల ఖాతాలు కూడా సెటిల్ చేస్తారా..? అంటూ వైసీపీ మద్ధతుదారులు సోషల్ మీడియలో సెటైర్లతో హోరెత్తిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే.. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో అనేకం అమలు చేయలేదు. రైతుల పంట, బంగారు రుణాలు భేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి 87 వేల కోట్ల రూపాయలకు గాను మూడు వాయిదాల్లో ఐదేళ్లలో కేవలం 13 వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. అవి వడ్డీకి కూడా సరిపోలేదు. వారి ఖాతాలు కూడా సెటిల్ చేస్తారా..?
అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలు తీసుకున్న 14 వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ కట్టవద్దని ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే చంద్రబాబు ప్రచారం చేశారు. ఆ మాటలు నమ్మిన కొంత మంది మహిళలు రుణాలు చెల్లించలేదు. బాబు వచ్చాక.. రుణామాఫీ చేయకపోవడంతో వారందరికీ బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయి. వడ్డీలు, అపరాధ రుసుములతో సహా బ్యాంకులు మహిళల నుంచి ముక్కు పిండి వసూలు చేశాయి. దాదాపు 90 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. మరి వారి ఖాతాలు కూడా సెటిల్ చేస్తారా..?
ఇంటికొక ఉద్యోగం, ఉద్యోగం ఇచ్చే వరకూ నెలకు రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని యువతకు హామీ ఇచ్చారు. పదవిలో ఉన్న ఐదేళ్లు బాబుకు ఆ హామీ గుర్తుకు రాలేదు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయనంగా 2019 ఎన్నికలకు ముందు తూతూ మంత్రంగా కేవలం 1.50 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చారు. 60 నెలల్లో మూడు నెలలు మినహాయిస్తే.. ఇంకా 57 నెలలకు సంబంధించి.. 1.14 లక్షల రూపాయలు ప్రతి నిరుద్యోగ యువతకు సెటిల్ చేయాల్సి ఉంది. వైసీపీ నేతల ఖాతాలు సెటిల్ చేస్తామంటున్న నారా లోకేష్.. తమకు సెటిల్ చేయాల్సినవాటిపై కూడా హామీ ఇస్తారా..? అనే ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. మరి లోకేష్.. ప్రజల ఖాతాల సెటిల్ చేయడంపై కూడా ఓ ప్రకటన చేస్తే బాగుంటుందేమో..!
Also Read : కేంద్రం మెడలో కోవాగ్జిన్ అధిక ధరల గంట