iDreamPost
android-app
ios-app

లోకేష్ కూడా వాడేశారు.. ఇక చంద్ర‌బాబే మిగిలారు..!

లోకేష్ కూడా వాడేశారు.. ఇక చంద్ర‌బాబే మిగిలారు..!

జూమ్ రాజ‌కీయాలు, రిఫ‌రెండం రాజ‌కీయాలు అయిపోయాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు దేవాల‌యాల వ‌ద్ద ప్ర‌మాణాల రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి. అన‌ప‌ర్తి, తాడిప్ర‌తి, విశాఖ‌లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స‌త్య ప్ర‌మాణాల బాట ప‌ట్టిన విష‌యం తెలిసిందే. వీరంతా అధినేత దృష్టిలో ప‌డేందుకు త‌హ‌త‌హ‌లాడారు. అంత వ‌ర‌కూ బాగానే ఉంది. ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి భూ క‌బ్జాల‌కు పాల్ప‌డ్డారంటూ ‌ఆవేశంగా స‌వాల్ విసిరిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్ర‌మాణం చేయ‌డానికి రాలేదు. దీంతో సవాళ్ల పర్వం ముగిసిపోయిందని తాము చేసిన ఆరోపణలు నిజమని నిర్ధారణ అయ్యిందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. ఆధారాలతో సత్య ప్రమాణానికి అమర్నాథ్‌ సిద్ధమయ్యారు. కానీ టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ రాలేదు. దాంతో ఆ క‌థ అంత‌టితో ముగిసిన‌ట్లే అయింది.

అనంత‌రం విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీ‌నివాస్ పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీ మంతెన స‌త్య‌నారాయ‌ణ‌.. క‌బ్జాల‌కు పాల్ప‌డ‌లేదంటూ ఒట్టు వేయ‌లేద‌ని మంత్రికి స‌వాల్ విసిరారు. అవంతి దీనికి సిద్ధ‌మా అని ప్ర‌శ్నంచారు. ఏ గుడో మీరే ఎంచుకోవాలంటూ మంత్రికి ఆప్ష‌న్ కూడా ఇచ్చారు. అలాగే తూర్పుగోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యేల మ‌ధ్య జ‌రిగిన ప్ర‌మాణాల అంశంపై అయితే బాగానే చ‌ర్చ‌నీయాంశం అయింది. ఎమ్మెల్యే సూర్య‌నారాయ‌ణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు . అంతేకాదు తాము ఎలాంటి అవినీతి చెయ్యలేదని బిక్కవోలు గణపతి ఆలయంలో స‌త్య ప్ర‌మాణాలు కూడా చేశారు. మొదట ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆయన సతీమణి ఆదిలక్ష్మి తో కలిసి గణపతి ఆలయానికి చేరుకుని సత్య ప్రమాణం చేశారు. మాజీ ఎమ్మెల్యే కూడా ప్ర‌మాణం చేశారు. అయిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత కూడా ఆరోప‌ణ‌లు కొన‌సాగాయ‌నుకోండి.

ఇప్పుడు టీడీపీ అధినేత కుమారుడు లోకేశ్ కూడా ప్ర‌మాణాల రాజ‌కీయం మొద‌లెట్టారు. పై నేత‌లంద‌రూ అధినేత వ‌ద్ద పేరు సంపాదించ‌డానికి తాప‌త్ర‌య ప‌డ్డారనుకుందాం. మ‌రి లోకేశ్‌..? ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే త‌న స్థాయి త‌గ్గుపోతంద‌నుకున్నారో లేదా.. నిజంగా ప్ర‌మాణాల‌కు వ‌చ్చేస్తార‌నుకున్నారో ఏమో.. ఏకంగా ముఖ్య‌మంత్రికే స‌వాల్ విసిరారు లోకేశ్‌. ట్విట్ట‌ర్ ను దీనికి వేదిక‌గా చేసుకున్నారు. లోకేశ్‌పై ప్ర‌భుత్వం చేస్తున్న ఆరోప‌ణ‌లు ఫేక్ అట‌. నీ బ‌తుకు ఫేక్.. నీ పార్టీ ఫేక్.. నాపై చేయించే ఆరోప‌ణ‌లూ ఫేక్.. ఎన్నాళ్లీ దొంగ ఆరోప‌ణ‌లు. సింహాచ‌లం అప్ప‌న్న స‌న్నిధికి నువ్వేరా తేల్చుకుందాం.. అంటూ ఆవేశంగానే స్టేట్ మెంట్ లు ఇచ్చారు. నువ్వు నాపై చేసిన ఆరోప‌ణ‌లు ప‌చ్చి అబ‌ద్దాలు అని ప్ర‌మాణం చేయ‌డానికి నేను సిద్ధం. నువ్వు సిద్ధ‌మా..? అంటూ సీఎం జ‌గ‌న్ కు లోకేశ్ స‌వాల్ విసిరారు. ఇలా తెలుగుదేశం నేత‌లంద‌రూ వ‌రుస‌గా ప్ర‌మాణాల బాట ప‌ట్ట‌డం ఏ రాజ‌కీయ‌మో అర్థం కావ‌డం లేదు. మీడియాలో క‌నిపించేందుకు టీడీపీ ఏదో ఒక మార్గాన్ని వ్యూహాత్మ‌కంగానే ఎంచుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. దాని ప్ర‌కారం ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు ఇలా స‌వాళ్ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. మొన్న‌టి వ‌ర‌కూ దేవాల‌యాల ధ్వంసంపై ఆందోళ‌న‌లు చేసిన వీరంతా ఇప్పుడు దేవుడి గుళ్ల కు రండి… ప్ర‌మాణాలు చేయండి.. అంటున్నారు. లోకేశ్ కూడా ప్ర‌మాణానికి రెడీ అన్నారు. ఇక మిగిలింది చంద్ర‌బాబే.