iDreamPost
android-app
ios-app

ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం అంటే గ్రాఫిక్స్‌ చూపించడమా లోకేశ్‌?

  • Published Feb 19, 2022 | 8:54 AM Updated Updated Feb 19, 2022 | 8:54 AM
ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం అంటే గ్రాఫిక్స్‌ చూపించడమా లోకేశ్‌?

విభ‌జ‌న‌తో న‌ష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం అంటే ప్రజావేదిక కూల్చినంత సులువు కాదు అంటున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మరి గ్రాఫిక్స్‌ అనుకుంటున్నారా? అని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన లోకేశ్‌ నిజానిజాలతో నిమిత్తం లేకుండా మాట్లాడారని తప్పుబట్టారు. ప్రజావేదిక కూల్చివేతపై ఇప్పటికీ బెంగపెట్టుకుంటున్న లోకేశ్‌కు అది అక్రమ కట్టడం అన్న సంగతి తెలియదా? నదీ పరీవాహక ప్రాంత పరిధిలో నిబంధనలకు నీళ్లొదిలి లింగమనేని రమేష్ నిర్మించిన కట్టడంలో ముఖ్యమంతిగా చంద్రబాబు కార్యకలాపాలు నిర్వహించినంత మాత్రాన అది సక్రమం అయిపోతుందా? నిబంధనల ప్రకారం దాన్ని కూల్చేస్తే .. ప్రభుత్వానికి అవగాహన లేకుండా ఏదో చారిత్రక కట్టడాన్ని కూల్చేసింది అన్నట్టుగా యాగీ చేయడం ఏమిటి? ఆ అక్రమ కట్టడంలో అన్నాళ్లూ చంద్రబాబు సమావేశాలు నిర్వహించినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

రాజధాని నిర్మాణం అంటూ కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసి పలుదేశాలు తిరిగి, టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లూ జనానికి గ్రాఫిక్స్‌ చూపించిన సంగతి మరచిపోయారా? అని అడుగుతున్నారు. రాజధాని నిర్మాణాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌గా మార్చిన ఘనత చంద్రబాబుది కాదా? అని ప్రశ్నిస్తున్నారు. అమరావతిలో పాలనకు ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనం నిర్మించలేదు. తాత్కాలిక కట్టడాలు పేరిట నాసిరకంగా నిర్మించినా ఫర్వాలేదని కాంట్రాక్టర్లతో ముందే లాలూచీ పడ్డారు. అందుకే వర్షాలకు నీళ్లు లోపలికి వచ్చే స్థాయిలో ఆ బిల్డింగ్‌లు నిర్మించారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణమేనా లోకేశ్‌ అని ప్రశ్నిస్తున్నారు.
 
మీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి

చంద్రబాబు హ‌యాంలో ఉద్యోగావ‌కాశాలకు నంబ‌ర్ వ‌న్‌గా ఉన్న ఏపీని సీఎం జ‌గ‌న్ నంబ‌ర్‌ సెవెన్‌కి దిగ‌జార్చారని ఆరోపిస్తున్న లోకేశ్‌ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా? అదే జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో 1.34 లక్షల గ్రామ సచివాలయాల ఉద్యోగాలు, దాదాపు 2.50 లక్షల వలంటీరు పోస్టులు, వైద్య ఆరోగ్యశాఖలో 45 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది. శాఖల వారీగా ఖాళీ అవుతున్న పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తోంది. 54 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేసింది. కోర్టు కేసులు తేలిన తర్వాత 2008 డిఎస్ సి లో మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేసింది. ఈ విధంగా గణాంకాలతో తమ హయాంలో ఉద్యోగాలను భర్తీ చేశామని లోకేశ్‌ చెప్పగలరా? మేమే నంబర్‌ వన్‌, మా పాలనే భేష్‌ అని భుజాలు చరుచుకుంటే ఎవరు నమ్ముతారు? అని ప్రశ్నిస్తున్నారు.

 ఏపీ ఉద్యోగార్థుల్లో నైపుణ్యం, ఆంగ్ల ప‌రిజ్ఞానం శూన్యం అని జాతీయ నైపుణ్యాల నివేదిక‌-2022 వెల్లడించిందని, త‌ల‌కాయ ఎక్కడ పెట్టుకుంటారు జ‌గ‌న్ గారు! అంటున్న లోకేశ్‌ ఉద్యోగార్థులను అవమానిస్తున్నాను అన్న సంగతి మరచిపోయారు. నైపుణ్యం, ఆంగ్ల పరిజ్ఞానం రాత్రికి రాత్రి పుట్టుకురావు. అంతకుముందు పనిచేసిన చంద్రబాబు విద్యారంగాన్ని ప్రయివేటుకు తాకట్టు పెట్టడం వల్లే అభ్యర్థులకు ఈ దుస్థితి ఏర్పడింది. అందుకే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి పెద్ద పీట వేయడమే కాక, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తోంది. ఉద్యోగార్థుల ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిహసిస్తున్న లోకేశ్‌ ఇన్నేళ్ల వయసొచ్చినా తన తెలుగును మాత్రం మెరుగుపరచుకోలేదని వైఎస్సార్‌ సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. తప్పులన్నీ తమ పాలనలో చేసి ఇప్పటి ప్రభుతాన్ని దానికి బాధ్యత వహించాలనడం ఏం నైపుణ్యం లోకేశ్‌ గారూ.. అని ప్రశ్నిస్తున్నారు.

Also Read : పెట్టుబడి సదస్సుల పేరుతో మీ నిర్వాకం మరిచారా లోకేష్..?