Idream media
Idream media
“ఏదేమైనా.. అయ్యకున్న రాజకీయ జ్ఞానంలో.. కొడుక్కి ఇసుమంతైనా లేదురా..? అదే ఉంటే పార్టీ పరిస్థితి ఇంత వరకూ వచ్చేది కాదు..”
“ఒకటా.. రెండా… ఎన్ని సార్లు ఇలా నవ్వులపాలవడం. ఆయన రావడం.. అవగాహన లేకుండా ఏదోకటి మాట్లాడడం.. అవతలి వారికి జోక్స్ వేసుకునే అవకాశం ఇవ్వడం.. మామూలైపోయింది.. ఇంత జరుగుతున్నా జాగ్రత్తగా మాట్లడకపోతే ఎలా..? ”.. ఇవీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై జరుగుతున్న చర్చలు.
ప్రజలలోనే కాదు.. సొంత పార్టీ కార్యకర్తల మధ్య కూడా ఈ తరహా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా లోకేశ్ కు సంబంధించి మరో విషయం ట్రోల్ అవుతోంది. రైతులు, పంట నష్టానికి సంబంధించి వైసీపీని ఉద్దేశిస్తూ వేసిన ప్రశ్నలు చంద్రబాబుకు చేటు తెచ్చేలా మారాయి.
వరదల్లో నష్టపోయిన రైతుల పరిహారం విషయంలో లోకేశ్ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ.. 33 శాతం పంటలు నష్టపోతేగానీ పరిహారం ఇవ్వరా? అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంలో మీడియాలో వచ్చింది. దీనికి సంబంధించిన జీవోను తెరపైకి తెచ్చిన వైసీపీ వర్గాలు దీనికి కారణం ఆయన తండ్రి, చంద్రబాబునాయుడే కారణమని తెలిపారు. 33 శాతం పంట నష్టపోతే పరిహారం ఇవ్వాలన్న నిబంధన కొత్తగా సీఎం జగన్ తీసుకురాలేదని చెప్పారు. 33 శాతం పంటలు నష్టపోతేనే పంట నష్టపరిహారం ఇవ్వాలంటూ 2015 డిసెంబర్ 4న చంద్రబాబు ప్రభుత్వం జీవోఎంఎస్ 15 జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ జీవో ఇచ్చినప్పుడు లోకేశ్‌కు అంత అవగాహన ఉండి ఉండదన్నారు. జీవోలో నిబంధనలు స్పష్టంగా ఉన్నాయన్నారు.
ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ నిబంధనలు, వీటిని ఎలా పొందుపరిచారో లోకేశ్ తెలుసుకోవాలని హితవు పలికారు. కేంద్రం ప్రకటించిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారమే చేస్తామన్నారు. చంద్రబాబు 2014లో జరిగిన పంట నష్టాలకు కూడా 2019లోనూ పరిహారం ఇవ్వలేదంటూ టీడీపీ హయాంలో చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నారు. సమస్యలు, జీవోలపై అవగాహన లేకుండా మాట్లాడితే అది తమకే చేటు తెస్తుందనే విషయాన్ని లోకేశ్ గుర్తించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. లోకేశ్ వ్యాఖ్యలతో ఆ జీవో వెలుగులోకి రావడం.. అందుకు కారణం చంద్రబాబు అని తెలియడం పార్టీ వర్గాల్లోనే చర్చగా మారింది. గతంలోనూ చాలా సందర్భాల్లో లోకేశ్ చేసిన ఆరోపణలు బెడిసికొట్టాయి. ఇప్పటికీ లోకేశ్ వ్యాఖ్యలను పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో జోకులు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.