iDreamPost
android-app
ios-app

ఏపీలో అమూల్‌.. ధరల్లో స్పష్టమైన మార్పు.. మాకేం నష్టం లేదంటున్న లోకేష్‌..

ఏపీలో అమూల్‌.. ధరల్లో స్పష్టమైన మార్పు.. మాకేం నష్టం లేదంటున్న లోకేష్‌..

డైరీ రంగంలో అగ్రగామి సహకార సంస్థ అయిన అమూల్‌ కార్యకలాపాలు ఈ రోజు బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభం అయ్యాయి. ఈ అంశంపై ఏపీ శాసన మండలిలో వాడీవేడీ చర్చ కూడా సాగింది. అమూల్‌ వల్ల లాభనష్టాలపై వివిధ పార్టీల ప్రతినిధులు మాట్లాడారు. రాష్ట్రంలో సహకార వ్యవస్థలోని డైరీలు మూతపడడానికి గల కారణాలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడారు. హెరిటేజ్‌ డైరీ కోసం చిత్తూరు డైరీ మూతపడేటట్లు చేశారని కన్నబాబు విమర్శించారు. అమూల్‌ వల్ల సహకార రంగం బలోపేతం అవుతుందని, రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

అమూల్‌ కార్యకాపాలు ప్రారంభం కావడంపై నారా లోకేష్‌ కూడా స్పందించారు. అమూల్‌ వల్ల ప్రైవేటు, సహకార డైరీలకు నష్టం ఉండబోదన్నారు. చిన్న డైరీలు తుడిచిపెట్టుకుపోతాయన్నారు. ఏపీ ప్రభుత్వం అమూల్‌ కోసం అప్పులు చేస్తోందని ఆరోపించారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. పాల ధరలు పోలుస్తూ ఇచ్చిన ప్రకటనల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరీ శివశక్తి, విశాఖ డైరీల రేట్లు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. శివశక్తి డైరీ అన్ని డైరీల కన్నా తక్కువ ధర ఇస్తోందని లోకేష్‌ విమర్శించారు.

అమూల్‌ కార్యకాపాలు ప్రారంభం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రభుత్వం ప్రకటనలు జారీ చేసింది. తాను అధికారంలోకి వస్తే పాడి రైతులకు లీటర్‌కు నాలుగు రూపాయల ప్రోత్సాహకం అందిస్తామని నాడు వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. దాని అమూల్‌ ద్వారా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ ప్రైవేటు డైరీల ధరలతో పోలుస్తూ అమూల్‌ ఇచ్చే ధరలను ఆ ప్రకటనలలో పొందుపరిచారు. 6 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌ వచ్చే పాలకు హెరిటేజ్‌ 33.60, డొడ్ల డైరీ 34.20, జెర్సి 34.80 రూపాయలు ఇస్తుండగా.. అమూల్‌ 39 రూపాయలు ఇస్తోంది. అదే 10 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌ వచ్చే లీటర్‌ పాలకు హెరిటేజ్, సంగం 58 రూపాయలు, జెర్సి 60 రూపాయలు ఇస్తుండగా.. అమూల్‌ మాత్రం 64.97 రూపాయలు ఇస్తోంది. మొత్తం మీద లీటర్‌పాలకు కనిష్టంగా 5 రూపాయలు, గరీష్టంగా ఏడు రూపాయల ఆదాయం అమూల్‌ వల్ల రైతులకు రాబోతోంది.

ఇంత పక్కాగా అమూల్‌ ద్వారా రైతులకు కలిగే లాభాలను ప్రభుత్వం రాత పూర్వకంగా తెలియజేయడం హెరిటేజ్‌ డైరీని నిర్వహిస్తున్న లోకేష్‌కు కొంత ఇబ్బంది కలిగినట్లుగా ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. ఎవరు ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా ప్రజలకు కోసం తాను చేయాలనుకున్న మంచిని చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎక్కడా వెనుకంజ వేయడంలేదు. వలంటీర్‌ వ్యవస్థ ఏర్పాటు నుంచి ఇప్పుడు అమూల్‌ కార్యకలాపాల వరకూ ఇదే నిరూపితమైంది.