iDreamPost
iDreamPost
జనం ఏమనుకుంటారో అన్న సోయలేకుండా నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడేయడం తెలుగుదేశం పార్టీ నాయకులకు అలవాటుగా మారిపోయింది. ఏం మాట్లాడినా తమ పచ్చ మీడియా అండతో జనాన్ని నమ్మించేయవచ్చన్నది వారి ధీమా. అందుకే పార్టీ అధినేత చంద్రబాబు నుంచి చోటా మోటా నాయకుడి వరకు అందరూ అబద్ధాలనే వల్లె వేస్తూ జనాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అదే పద్దతిని అనుసరించారు.
కృష్ణా జిల్లా పెడనలో నేతన్న కాచన పద్మనాభం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తనదైన శైలిలో స్పందించారు. టీడీపీ హయాంలో నేతన్నకు ఏడాదికి సుమారు రూ.50 వేలకు పైగా వచ్చే ప్రోత్సాహకాలను, రాయితీలను ఇచ్చేవారమన్నారు. ప్రస్తుతం వాటిని ఆపేసి రూ.24 వేలను చేతిలో పెట్టి సరిపెట్టుకోమంటున్నారన్నారు. దీనివల్లే ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ఆరోపించి జనాన్ని తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేశారు.
వైఎస్సార్ నేతన నేస్తంతో ఆర్థిక సాయం
తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆప్కో కొనుగోళ్లు ఆగిపోయి, మజూరీ, రాయితీలు రాక నేత కార్మికులు అనేక ఇబ్బందులు పడేవారు. పాదయాత్రలో చేనేత కార్మికుల కష్టాలు విని చలించిపోయిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారి బతుకులు బాగు చేయడానికి అధికారంలోకి రాగానే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద సొంత మగ్గం కలిగిన చేనేత కార్మికుడికి ఏటా 24.000 వేల చొప్పున అయిదేళ్లూ అందజేస్తారు. ఆ సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకం 2019 డిసెంబర్ 21న ప్రారంభించగా మొదటి విడతగా 69,308 చేనేత కార్మికులకు 24,000 చొప్పున జమ చేశారు. 2021 ఆగస్టు 10 మూడో విడతగా 80,032 కార్మికులకు అందజేశారు. అంటే ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది.
టీడీపీ హయాంలో చేసింది శూన్యం
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబునాయుడు తన పాలనా కాలంలో నేత కార్మికులకు ఉపయోగించే ఫలానా పని చేశాను అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. కానీ ఆయన పుత్రరత్నం లోకేశ్ ఏడాదికి రూ.50 వేలకు పైగా ప్రోత్సాహకాలను, రాయితీలు ఒక్కో నేత కార్మికుడి అందించామని అవాస్తవాలు మాట్లాడేస్తున్నారు. ఏ పథకం కింద, ఎంతమంది కార్మికులకు, ఎన్ని కోట్లు టీడీపీ హయాంలో ప్రోత్సాహకాలు, రాయితీలుగా అందించారో చెబితే బావుండును. నేత కార్మికులకు కూడా తెలియని ఈ ప్రోత్సాహకాలు, రాయితీలు ఎవరికి అందించారో ఆయనే చెప్పాలి. ఆర్థిక దుస్థితి వల్ల, అప్పులతోనూ ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టేసి విమర్శలు చేయడం, అవాస్తవాలు మాట్లాడి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దారుణమని లోకేశ్ వైఖరిని వైఎస్సార్ సీపీ నేతలు తప్పుపడుతున్నారు. తన పదవీకాలం అయిదేళ్లూ జనం సమస్యలను గాలికొదిలేసి, అమరావతి గ్రాఫిక్స్‌లో కాలక్షేపం చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు తాము అవి చేశాం. ఇవి చేశాం అని చెబితే ఎవరూ నమ్మరు అన్న సంగతి గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.
Also Read : పట్టాభి నోట.. అదే తీట