iDreamPost
iDreamPost
ఏపీ ప్రభుత్వ పెద్దలపై నేరుగా విమర్శలు చేయలేని విపక్షం అడ్డదారులు తొక్కుతోంది. అందుకు అనుగుణంగా అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. అడ్డగోలుగా వ్యవహరించే క్రమంలో అభాసుపాలవుతున్నా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే టీటీడీని అప్రతిష్టపాలుజేసేందుకు పూనుకుని ఏకంగా టీడీపీ కార్యకర్తలు పట్టుబడ్డారు. పోలీసు కేసుల్లో ఇరుక్కున్నారు. ఆ తర్వాత మంత్రులు, అందులోనూ మహిళా మంత్రులపై దుష్ప్రచారాలకు పూనుకున్నారు. మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సైబర్ నేరాల్లో చిక్కుకున్నారు.
ఇక ఇప్పుడు అన్నీ దాటేసి ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లంపైనా, మంగళగిరి ఎమ్మెల్యేపైనా అబద్ధాలతో కూడిన ప్రచారాలకు పూనుకున్నారు. ఆ వ్యవహారంలో ఏకంగా టీడీపీ ఎమ్మెల్సీ , మాజీ మంత్రి నారా లోకేష్ పీఆర్వోగా ఉన్న చైతన్య పేరు కూడా ప్రచారంలోకి రావడం విస్మయకరంగా మారింది. త్వరలో అతన్ని అరెస్ట్ చేస్తామని మంగళగిరి పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యవహారం పెద్ద చర్చకు తెరలేపుతోంది.
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పై చేస్తున్న అసత్య ప్రచారాలకు తోడుగా తాజాగా అజయ్ కల్లం పేరుతో ఉద్యోగాలిప్పిస్తామనే కుట్రకు పూనుకున్నట్టు అనుమానిస్తున్నారు. విద్యుత్ శాఖలో ఉద్యోగాలిప్పిస్తామని అజయ్ కల్లం పేరు ప్రస్తావించడంపై నేరుగా ఆయనే ఫిర్యాదు చేశారు. తన పేరుతో సాగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అజయ్ కల్లంకి సంబంధం లేకుండా ఆయన పేరుతో ఉద్యోగాలిప్పిస్తామని కొందరికి వల వేయడం, ఆ తర్వాత ఆయన్ని బద్నాం చేసేందుకు ఈ ప్రయత్నాన్ని వినియోగించుకోవడం వెనుక భారీ ప్రణాళిక ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
ఈ కుట్ర మొత్తంలో నారా లోకేశ్ అనుచరులు, స్వయంగా ఆయన పీఆర్వో చైతన్య పాత్ర ఉండడం కలకలం రేపుతోంది. ఇప్పటికే వెబ్ సైట్ నిర్వాహకుడు కే వేణుని అరెస్ట్ చేశారు. కీలక సమాచారం సేకకరించారు. సోషల్ మీడియాలో అజయ్ కల్లం, ఆర్కేకి వ్యతిరేకంగా సాగించిన దుష్ప్రచారానికి సంబంధించిన కంటెంట్ రూపకల్పనలో చైతన్య పాత్రను వెల్లడించారు. త్వరలో అతన్ని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో మొత్తం ఈ భాగోతంలో బాగస్వాములంతా నారా లోకేష్ అనుచరులే కావడంతో తామే మోసాలకు పాల్పడుతూ, దానిని అజయ్ కల్లం వంటి వారికి ఆపాదించడం, దానిపై మళ్లీ ప్రచారాలు సాగిస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రక్రియను చేపట్టడం విస్మయకరంగా మారింది.
టీడీపీ నేతలు, అనుచరులు ఎంతకైనా దిగజారే ప్రయత్నంలో ఉన్నారని స్పష్టమవుతోంది. నేరుగా ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక ఇలాంటి కుయక్తులు పన్నుతున్నట్టు అర్థమవుతోంది. ప్రస్తుతం మంగళగిరి కేంద్రంగా బయటపడిన ఈ వ్యవహారంలో అసలు కుట్రదారుల పాత్ర కూడా బయటపెట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే వేణుతో పాటుగా లారెన్స్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.