iDreamPost
iDreamPost
టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగి పరాజయం పాలయిన తర్వాత పార్టీలో కూడా పట్టు తప్పుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు టీడీపీని వీడుతూ లోకేశ్ మీద గురిపెడుతున్నారు. ఘాటు వ్యాఖ్యలతో, వ్యంగ్యంగా మాట్లాడుతూ లోకేశ్ ని మరింత పలుచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజకీయంగా తన భవిష్యత్తు కోసం అనూహ్యంగా మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్న లోకేశ్ ఓటమి తర్వాత కూడా ఆశ వదలడం లేదు. రాజధాని ప్రాంతంగా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో పాగా వేయాలని ఆశించి ఆయన ఇప్పటికే భంగపడ్డారు. అయినప్పటికీ మంగళగిరి చుట్టూ ఆయన ప్రదిక్షణలు ఆపలేదు. ఎన్నికల ముందు హడావిడిగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదని భావిస్తున్న టీమ్ లోకేశ్ ఇప్పటి నుంచే నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయించేందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచించారు.
అందులో భాగంగానే తన కార్యకలాపాల్లో ఎక్కువ భాగం మంగళగిరిలో ఉండేలా నారా లోకేశ్ చూసుకుంటున్నారు. ఇటీవల ఇసుక దీక్షతో పాటుగా పలు కార్యక్రమాలను ఆయన మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించారు. తాజాగా మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో గ్రామాల్లో ఆయన పర్యటనలు చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఆ సందర్భంగా నారా లోకేశ్ తీరు పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధికారం కోల్పోయి, రాష్ట్ర వ్యాప్తంగా అభాసుపాలవుతున్న లోకేశ్ తమ ప్రాంతానికి వచ్చి పాగా వేయాలని చూస్తున్న తీరుని కొందరు కీలక నేతలు సహించలేకపోతున్నారు. వారి అనుచరులు కూడా తమ అసహనాన్ని లోకేశ్ ముందే ఇటీవల ప్రదర్శించడంతో ఆయన ఖంగుతిన్నట్టు చెబుతున్నారు.
ఓ వైపు జగన్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు చొరవగా ప్రజల్లో దూసుకుపోయే ఆర్కే పనితీరుతో సామాన్యులు సైతం సర్కారు పట్ల ఆశాభావంతో ఉండగా, ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందంటూ ఆందోళనలు చెపట్టాలని ఒత్తిడి చేయడాన్ని వారు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. పైగా కీలక సామాజికవర్గాలకు ప్రాధాన్యత లేకుండా తన కోటరీ సహాయంతో పెత్తనం చేయడాన్ని సహించలేకపోతున్నట్టు కనిపిస్తోంది. దాంతో మళ్లీ వచ్చే ఎన్నికల్లో కూడా మంగళగిరి బరిలో దిగి మరోసారి అదృష్టం పరీక్షించుకోవాలనే ఆశాభావంతో ఉన్నట్టు కనిపిస్తున్న లోకేశ్ కి సొంత శిబిరంలోనే సెగ తగులుతుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లోకి వెళుతున్నట్టు కనిపిస్తోంది. చివరకు లోకేశ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది పక్కన పెడితే మంగళగిరి టీడీపీ శ్రేణులు కూడా ఆయన నాయకత్వాన్ని ఆస్వాదించే పరిస్థితి కనిపించకపోవడం విశేషమే.