Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సహా ఆ పార్టీ ఎమ్మెల్యే రామరాజు, టీడీపీ శ్రేణులకు తృటిలో ప్రమాదం తప్పింది. నారా లోకేష్ వల్ల జరగబోయే ఈ ప్రమాదాన్ని పశ్చిమ గోదావరి జిల్ల ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై తప్పించారు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న లోకేష్.. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలానికి వెళ్లారు.
స్థానిక ఎమ్మెల్యే రామరావు, టీడీపీ శ్రేణులు, సెక్యూరిటీ సిబ్బందితో నారా లోకేష్ ట్రాక్టర్‌పై వెళ్లారు. అయితే ట్రాక్టర్‌ను నారా లోకేష్ నడిపారు. ఈ క్రమంలో ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి కాల్వలోకి దూకెళ్లింది. దీంతో ట్రాక్టర్‌పై, ట్రక్కులో ఉన్న వారు బెంబేలెత్తిపోయారు. రామారాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను నిలువరించడంతో అందరూ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నారా లోకేష్‌కు కూడా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిపీల్చుకుంది.
లోకేష్ ట్రాక్టర్ నడిపిన దృష్యాలు, ట్రాక్టర్ కాల్వలోకి వెళ్లిన చిత్రాలు సోషల్ మీడియాలో రావడంతో.. వాటిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రమాదం నుంచి లోకేష్ సహా అందరూ బయటపడడంతో సంతోషం వ్యక్తం చేస్తూ.. వచ్చీ రాకుండా ట్రాక్టర్ నడిపిన లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు సెటైర్లు వేస్తున్నారు. ట్రాక్టర్ కూడా నడపని రాని వ్యక్తి.. పార్టీని ఏం నడుపుతారని ఎద్దేవా చేస్తున్నారు. ప్రచారం కోసం అందరి ప్రాణాలు రిస్క్‌లో పెడతారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. తండ్రికి మాదిరిగానే తనయుడు లోకేష్‌కు కూడా ప్రచార యావ అధికంగానే ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రచారం కోసం కాకుండా ప్రజల కోసం పని చేసినప్పుడే వారి మనస్సులు చూరగొంటారని నెటిజన్లు సలహాలు కూడా ఇస్తున్నారు.