iDreamPost
android-app
ios-app

నేతల మరణాల మీద మాట్లాడటం ఏమి సంస్కారం లోకేష్ ?

  • Published Feb 03, 2021 | 5:30 AM Updated Updated Feb 03, 2021 | 5:30 AM
నేతల మరణాల మీద మాట్లాడటం ఏమి సంస్కారం లోకేష్ ?

నిన్న తూర్పుగోదావరి జిల్లా పర్యటించిన లోకేష్ గొల్లలగుంటలో అనుమానాస్పదంగా మృతి చెందిన శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ డిజిపి వైసీపీ కండువా కప్పుకొన్నారని , టీడీపీ కార్యకర్తలను హత్యలు చేస్తున్నారని , వైఎస్ ఎలా చనిపోయారో జగన్ తెలుసుకోవాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు .

రోజురోజుకీ టీడీపీ నాయకుల్లో ఏం మాట్లాడుతున్నామో అన్న సోయి లేకుండా పోతున్నట్లు ఉంది. అధికార కాంక్షతో ఇతర రాజకీయ పక్షాల పట్ల అసూయా ఆక్రోశాలతో చేసే దిగజారుడు వ్యాఖ్యలు సభ్య సమాజం హర్షించలేని విధంగా మారుతున్నాయి .దిగువ శ్రేణి కార్యకర్తలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తేనే వినడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది . సోషల్ మీడియాలో ఎక్కడో ఓ మూలన గుర్తు తెలియని వ్యక్తులు మాట్లాడే అనైతిక వ్యాఖ్యలు మూడు శాఖలకు మంత్రిగా వ్యవహరించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాట్లాడటం సిగ్గుచేటు .

మరణం ఎవరికైనా అనివార్యం . అది యాక్సిడెంట్ రూపంలో రావడం కాకతాళీయం . ప్రమాదంలో మరణించడం వైఎస్ తోనే మొదలు కాదు . ప్రపంచంలో ఎందరో నాయకులు పలు వాహన ప్రమాదాల్లో దుర్మరణం పాలయ్యారు . వారందరూ చనిపోవటానికి కూడా ఇలాగే కారణాలు అంటగట్టగలడా నారా లోకేష్ . అంతెందుకు టీడీపీ నాయకులు ఎలిమినేటి మాధవరెడ్డి , ఎర్రన్నాయుడు , జిఎంసి బాలయోగి సహా పలువురు నాయకులు వాహన ప్రమాదాల్లో మరణించారు . వాటి నుంచి టీడీపీ నాయకులు ఏమి నేర్చుకొన్నారో , ఎంత తెలుసుకొన్నారో లోకేష్ చెప్పాల్సి ఉంటుంది.

ఏ రోజూ తన మాతామహుణ్ణి కనీసం తలుచుకోని నారా లోకేష్ టీడీపీ వ్యవస్థాపకుడు , దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రతి జయంతికి , వర్ధంతికి బహిరంగంగా నివాళులు అర్పిస్తూ ఉంటారు కానీ ఆయన మరణం గురించి ఏమి తెలుసుకొన్నారో కూడా లోకానికి చెప్పాలి . ఎన్టీఆర్ పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ తన అల్లుడూ , లోకేష్ తండ్రి అయిన చంద్రబాబు తనని ఎలా మోసం చేసి ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నదీ , కొన్ని వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని పార్టీని , పార్టీ ఆస్తులని అక్రమంగా స్వాధీనం చేసుకొన్నదీ చెబుతూ కన్నీళ్ల పర్యంతం అయ్యిందీ లోకేష్ తెలుసుకొన్నారో లేదో చెప్పాల్సి ఉంది . చివరి రోజుల్లో కుటుంబ సభ్యులు ఎవరూ ఆదరించక ,తిండికి కూడా పనివారి మీద ఆధారపడవలసి వచ్చిందని ,చేదోడు వాదోడుగా ఉంటుందని పెళ్లి చేసుకొంటే ఆ పెళ్లిని బూచిగా చూపి తన బిడ్డల్ని వంచించి తనకు కాకుండా చేసిన చంద్రబాబుని ఎన్ని మాటలని కుమిలిపోతూ మరణించారో లోకేష్ కి గుర్తు ఉంటే ఇలా అనుచితంగా మాట్లాడి ఉండేవారు కాదేమో .

వైశ్రాయ్ హోటల్ నుంచి చెప్పులదాడి జరిగిన రోజే తానూ మానసికంగా చనిపోయాని ఎన్టీఆర్ చెప్పిన విషయం లోకేష్ కు తెలియకపోవచ్చు కానీ ఎన్టీఆర్ దిగులుతో బాధతో అల్లుడు దశమాగ్రహం అంటూ చెప్పిన వీడియో ఇప్పటికి ట్రెండ్ అవుతుంది ,దాన్ని చూసి లోకేష్ తెలుసుకోవలసింది .నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. ఎన్టీఆర్ గుండెపోటు వచ్చే స్థాయిలో ఎందుకు బాధపడ్డారో,ఆరోజు కోర్టు ద్వారా పార్టీ నిధులను ఏవిధంగా స్వాదీనం చేసుకుంది లోకేష్ తెలుసుకోవాలి.

ఈ సందర్భంగా వేమన శతకంలో ఓ ఉదాహరణ గురించి కూడా లోకేష్ తెలుసుకొంటే మంచిది ..

తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జరులకెల్ల నుండుదప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ..!

ఒకవేలు సమాజం వైపు చూపబోతే నాలుగు వేళ్ళు నీ వైపు చూస్తాయని ఇప్పటికైనా లోకేష్ తెలుసుకొని ప్రవర్తిస్తే మంచిది . లేకుంటే ఇతర పక్షాల వారు టీడీపీ పార్టీ వ్యవస్థాపకుని నుండి వందల మంది గురించి వేలెత్తి చూపే అవకాశం ఉంది . మరణించిన వ్యక్తుల గురించి హేళన చేసే దుస్సాoప్రదాయం. ఎవరికీ మంచిది కాదు.