iDreamPost
android-app
ios-app

లోకేష్‌: చేయూతా..? చేతివాటమా..?

లోకేష్‌: చేయూతా..? చేతివాటమా..?

ప్రజా స్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ కీలకమే. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, తీసుకునే నిర్ణయాలలో లోపాలను ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాని కన్నా ప్రతిపక్ష పార్టీకే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఆ బాధ్యతను ఎంత చక్కగా నిర్వహిస్తారనే దానిపై ప్రతిపక్ష పార్టీ భవిష్యత్, ప్రజల మద్ధతు ఆధారపడి ఉంటుందనేని ఎన్నో మార్లు రుజువైంది. 2019 ఎన్నికల్లో జగన్‌ మరోమారు రుజువు చేశారు. ఇప్పుడు టీడీపీ వంతు.

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీల అమలు ఏ మాత్రం భిన్నంగా ఉన్నా.. ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం ప్రజల తరఫున నిలదీయాలి. అప్పుడే ప్రజల మెప్పు పొందగలదు. కానీ ఏదో విమర్శలు చేయాలని, నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఉన్నది పోతుంది. ఆ పార్టీ భవిష్యత్‌ నేతగా, భావి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చలామణిలో ఉన్న నారా లోకేష్‌ టీడీపీకి బలంగా కాకుండా బలహీనతగా మారుతున్నారని ఈ రోజు ఆయన జగన్‌ ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్సార్‌ చేయూత పథకంపై చేసిన విమర్శలను బట్టి తెలుస్తోంది.

సీఎం ప్రారంభించింది.. వైఎస్సార్‌ చేయూత కాదని, జగన్‌ చేతి వాటమని లోకేష్‌ విమర్శించారు. 45 ఏళ్లకే ఫింఛన్‌ అని చెప్పి.. అలా ఇస్తే 1.80 లక్షలు ఇవ్వాల్సి వస్తుందని, చేయూత అంటూ మహిళలకు నాలుగేళ్లలో లక్ష 5 వేల రూపాయల నష్టం చేకూర్చారని బాధపడ్డారు. బాధ్యతగల ప్రతిపక్ష పార్టీ ముఖ్య నేతగా, ఆ పార్టీ యువ సారధిగా.. లోకేష్‌ అంత్యంత అప్రమత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ లోకేష్‌ సోషల్‌ మీడియాలో ఓ సాధారణ టీడీపీ కార్యకర్త పెట్టినట్లు.. ట్విట్టర్‌లో వైఎస్సార్‌ చేయూత పథకంపై విమర్శలు చేశారు.

వైఎస్సార్‌ చేయూత ద్వారా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని 45–60 ఏళ్ల మహిళలకు 18,750 చొప్పన 4,687 కోట్ల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇక్కడ లోకేష్‌ ఆరోపించినట్లు జగన్‌ చేతి వాటం ఎక్కడ ఉంది.? చేతి వాటం అంటే.. ఈఎస్‌ఐ స్కాం మాదిరిగా.. అధిక ధరలు నిర్ణయించి.. అందులో చేతివాటం ప్రదర్శించి మన ఖజానా నింపుకోవడం అవుతుందన్న విషయం అమెరికాలో ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకున్న కారణంగా తెలుగు సరిగా రాని లోకేష్‌కు తెలియకపోవచ్చు.

45 ఏళ్లకే మిమ్మల్ని జగన్‌ ముసలివాళ్లను చేశారంటూ.. నవరత్నాల్లో పథకం ప్రకటించినప్పుడు ప్రత్యేకంగా వీడియో ప్రకటనలు చేసి టీడీపీ విమర్శించింది. మహిళల్లో ఆ భావన రాకూడదనే ఉద్దేశంతో.. ఫించన్‌ అనే మాటను తొలగించి.. ఏడాదికి 18,750 చొప్పన వైఎస్సార్‌ చేయూత కింద నాలుగేళ్లలో 75 వేల రూపాయలు అందిస్తామని జగన్‌ తన ఎన్నికల తుది మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టారు. ఆ మేరకు రెండో ఏడాదిలోనే పథకం ప్రారంభించారు. తన హాయం ముగిసేలోపు మిగతా మూడు వాయిదాల నగదు లబ్ధిదారుల ఖాతాల్లోకి ఎవరి ప్రమేయం లేకుండా చేరుతుంది.

పూర్వా పరాలు పరిశీలించకుండా, పూర్వం తాము చేసిన విమర్శలను మరచిపోయి, తలా తోకాలేకుండా మాట్లాడడం వల్ల ఉన్న పరువు కాస్తా పోగొట్టుకోవడం మినహా వచ్చేది ఏమి ఉండదు. ఈ సారి విమర్శలు చేసేటప్పుడు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో చూసి నారా లోకేష్‌ విమర్శలు చేస్తే అబాసుపాలుకాకుండా ఉండొచ్చు. లేదంటే.. చేసే విమర్శల వల్ల లాభం లేకపోగా.. ప్రభుత్వ పథకాన్ని ప్రచారం చేసిన వారవుతారు.