iDreamPost
android-app
ios-app

టీడీపీ కష్టాలు రెట్టింపు చేయబోతున్న కొత్త జిల్లాలు

  • Published Jan 27, 2022 | 2:10 AM Updated Updated Mar 11, 2022 | 10:21 PM
టీడీపీ కష్టాలు రెట్టింపు చేయబోతున్న కొత్త జిల్లాలు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చివరిసారిగా జరిగిన తర్వాత టీడీపీకి కష్టాలు పెరిగాయి. 2009 ఎన్నికల్లో మహాకూటమిగా జతగట్టినా ఆపార్టీ ఆశలు నెరవేరలేదు. ఇప్పుడు మళ్లీ జిల్లాల విభజన టీడీపీని మరింత సతమతం చేసేలా ఉంది. అప్పుడూ, ఇప్పుడూ ఆపార్టీ విపక్షంలో ఉండగానే పునర్విభజన జరుగుతోంది. అయితే ఈసారి చిన్న చిన్న మార్పులు తప్ప పూర్తిగా ఎన్నికల మ్యానిఫెస్టోకే కట్టుబడి జగన్ తీరు టీడీపీకి తలనొప్పిగా తయారయ్యింది. అందుకు వివిధ కారణాలున్నాయి.

ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు టీడీపీ పరువు తీసేలా ఉంది. ముఖ్యంగా చెప్పింది ఆచరించడంలో జగన్ చూపుతున్న చొరవ చంద్రబాబు కష్టాలు రెట్టింపు చేసింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేయలేకపోవడం చివరకు కమ్మ కులస్తుల్లో సైతం కంటగింపుగా మారింది. జగన్ ని కమ్మ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నాలకు తాజా నిర్ణయం ఆటంకం అవుతుందని టీడీపీ బెంగ పెట్టుకుంది. కమ్మ కులంలో ఎక్కువ మంది అభిమానించే ఎన్టీఆర్ పేరు నిలిచిపోయే పనికి జగన్ పూనుకోవడం చివరకు చంద్రబాబు కుటుంబీకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే పురందేశ్వరి వంటి వారు ఈ నిర్ణయాన్ని ఆహ్వానించారు. అందులో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా వస్తుండడం చాలామందిని సంతృప్తి పరుస్తోంది.

కోనసీమ పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని చాలాకాలంగా కోరుతున్నారు. చివరకు టీడీపీ నేతలు ఆందోళనలు కూడా చేశారు. ఆపార్టీకి చెందిన మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ వంటి వారు దీక్షలకు పూనుకున్నారు. అయినా చంద్రబాబు హయాంలో అది నెరవేరలేదు. కలగా మిగిలిందనుకున్న కోనసీమ జిల్లాను జగన్ ఆచరణలోకి తీసుకురావడం ఆప్రాంత వాసులకు ఆనందాన్నిస్తోంది. బాపట్ల కేంద్రంగా వస్తున్న జిల్లాతో భవిష్యత్తు మారుతుందనే అంచనాలు కూడా ఆ ప్రాంత వాసుల్లో ఉన్నాయి. పల్నాడు జిల్లాను పలువురు ప్రశంసిస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు పేరుతో పాడేరు కేంద్రంగా ఏజెన్సీ మండలాలతో రాబోతున్న జిల్లా క్షత్రియుల్లో ఆనందాన్నిస్తోంది. అల్లూరి అభిమానులు కూడా ఆహ్వానిస్తున్నారు. మన్యం వాసులు కూడా ఆస్వాదిస్తున్నారు. దాంతో వివిధ వర్గాలను సంతృప్తి పరిచేలా సుదీర్ఘకాల డిమాండ్ ను నెరవేరుస్తున్న జగన్ శైలిని జనం ఆహ్వానిస్తున్నారు. ఇక అన్నమయ్య జిల్లా విషయంలోనూ అదే స్పందన వస్తోంది. బాలాజీ జిల్లా విషయంలో శ్రీ వెంకటేశ్వర గానీ, తిరుపతి అని గానీ ఉంచాలనే డిమాండ్ ఉన్నప్పటికీ కొత్త జిల్లాలను సర్వత్రా ఆహ్వానిస్తున్నారు.

విపక్ష బీజేపీ నేతలు కూడా కొత్త జిల్లాలను ఆహ్వానించారు. ఇతర సంఘాలు, పార్టీలు కూడా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాయి. కానీ టీడీపీ మాత్రం అదికారికంగా నోరు మెదపలేని సందిగ్ధంలో ఉండడం ఆపార్టీ చిక్కులను చాటుతోంది. కొత్త జిల్లా ఏర్పాటు కోసం 2015లో చంద్రబాబు కొంత ప్రయత్నం చేసి మధ్యలోనే ఆపేశారు. కానీ ఇప్పుడు జగన్ ఏకంగా తాను చెప్పిన మేరకు జిల్లాలను మనుగడలోకి తీసుకురావడం టీడీపీకి కక్కలేక మింగలేక అన్న చందంగా మార్చేసింది. చెప్పింది చేస్తాడనే ముద్ర మరింత బలపడడం తో పాటుగా టీడీపీ ఆశలుపెట్టుకున్న వర్గాలను కూడా సంతృప్తిపరిచే నిర్ణయంలా ఉండడంతో తెలుగుదేశం నేతల కష్టాలు రెట్టింపు చేసే దిశలో ఉంది. చంద్రబాబు చేయలేకపోయారనే అభిప్రాయం. జగన్ చేసి చూపించారనే సంతోషం కలిసి బాబుకి నోట మాట లేకుండా చేసినట్టుంది.