Idream media
Idream media
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ఈ నెల 30 చివరి తేదీ. అంటే రేపే. ఇంకా టీఆర్‌ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. చివరి నిమిషం వరకూ ఇరుపార్టీలూ ఒకరి అభ్యర్థి కోసం మరొకరు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇక సమయం లేకపోవడంతో నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి మొదటి నుంచీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణులు కూడా ప్రచారం చేస్తున్నా పార్టీకి ఓటేయాలనే కోరుతున్నారు. ఇప్పుడు తాజాగా టీఆర్‌ఎస్ టికెట్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌కే ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది.
దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన నష్టాన్ని పట్టభద్రుల ఎన్నికల్లో పూడ్చుకున్నామని.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీ సాధించి ఇక తిరుగులేదని నిరూపించుకోవాలని.. అధికార టీఆర్‌ఎస్ భావిస్తోంది. దీంతో సాగర్ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రతి అంశాన్నీ సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే.. అభ్యర్థి ఎవరనేది మంత్రులకు, ఎమ్మెల్యేలకు సైతం తెలియకుండా చివరిదాకా సీఎం గోప్యత పాటించారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ముహూర్తం బాగుండడంతో ఆ సమయంలో అభ్యర్థిపై ప్రకటన చేయనున్నట్టు సమాచారం. పార్టీ తరఫున అభ్యర్థి ఖరారు కాకముందే.. ప్రచార బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యేలు స్థానికంగా తీవ్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు, ఆసరా పెన్షన్ దారులు ఇలా అన్ని వర్గాలవారితో విడివిడిగా, మండలాల వారీగా సమావేశాలు పెట్టి సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ సంక్షేమ పథకాల గురించి గుర్తుచేస్తున్నారు.
బీజేపీ కూడా…
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థిని సోమవారం ఖరారు చేయనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం కొంత మంది ముఖ్యనేతలతో ఉప ఎన్నికపై చర్చించారు. ఈ ఎన్నికలో టికెట్ కోసం పార్టీ నాయకులు నివేదిత రెడ్డి, రవికుమార్ నాయక్, అంజయ్య యాదవ్ ప్రధానంగా పోటీ పడుతున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఒకరిద్దరు బయటి నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నట్టు పేర్కొన్నాయి. టీఆర్‌ఎస్ ఎవరిని ప్రకటిస్తుందన్నది చూసుకొని, అందుకు అనుగుణంగా సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థిని ప్రకటించాలని బీజేపీ నిర్ణయించింది. మంగళవారం నామినేషన్ దాఖలకు చివరి రోజు కావడంతో సోమవారం సాయంత్రానికల్లా పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. సామాజిక వర్గ సమీకరణాలను సమర్థంగా ఉపయోగించుకొని సాగర్‌లో టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇవ్వాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో రెడ్డి, యాదవ, లంబాడ సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. ఒక్కో సామాజిక వర్గానికీ 35 వేల నుంచి 40 వేల వరకూ ఓటు బ్యాంకు ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డి కాగా.. టీఆర్‌ఎస్ పార్టీ యాదవ సామాజిక వర్గానికి ఇస్తుందని బీజేపీ నేతలు అంచనా వేసి, లంబాడా సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ రవినాయక్‌ను అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.