Idream media
Idream media
తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థుల మధ్య సారూప్యతలు ఆసక్తిగా మారాయి. ఒకరు ఇంజనీర్, మరొకరు డాక్టర్ కాగా, ఇంకొకరు రాజకీయాల్లో తలపండిన ఉద్దండుడు. ఆ ఇద్దరి వయసు 36 ఏళ్ల లోపే కాగా, మరొకరి వయసు 75 ఏళ్లు. ఆ ఇద్దరి వయసు కలిపినా సీనియర్ అభ్యర్థి వయసు కంటే తక్కువే. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది. యువ నాయకత్వాన్ని కోరుకుంటారా? లేదా సుదీర్ఘ అనుభవానికి జై కొడతారా? అనే చర్చలు జరుగుతున్నాయి. నాగార్జునసాగర్‌లో ప్రచార జోరు పెరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేయగా, అభ్యర్థిత్వం ఖరారు అయిన వెంటనే టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కుమార్, బీజేపీ అభ్యర్థిగా రవికుమార్‌నాయక్ ప్రచారపర్వంలోకి దిగిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో పది సార్లు పోటీ చేసి ఏడు సార్లు గెలిచిన అనుభవం జానారెడ్డి అయితే.. మిగతా పార్టీల అభ్యర్థులు ఇద్దరికీ రాజకీయాల్లోకి ఇదే అరంగేట్రం.
జానా.. నాటి వైభవం పొందేనా
సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన మాజీ మంత్రి జానారెడ్డి 1946లో జన్మించారు. అంటే ఇప్పటికి ఆయన వయసు 75 ఏళ్లు. చలకుర్తి నియోజకవర్గం నుంచి 1978లో తొలిసారిగా జనతా పార్టీ తరఫున జానారెడ్డి పోటీ చేశారు. నాటి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి 1983, 1985 ఎన్నికల్లో వరుసగా పోటీ చేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన జానారెడ్డి 1989 ఎన్నికల్లో పోటీ చేశారు. వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచినా నాటి టీడీపీ అధినేత ఎన్టీఆర్ ప్రభంజనంలో ఓటమిపాలయ్యారు. తిరిగి 1999, 2004 ఎన్నికల్లో చలకుర్తి నుంచి, 2009, 2014 ఎన్నికల్లో సాగర్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచారు. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో సుమారు 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం జానారెడ్డిది. అలాగే సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేశారు. నోముల మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికలో తొలుత ఆయన కొడుకును పోటీకి దించాలని భావించారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఈ ఎన్నిక జీవన్మరణ సమస్య కావడంతో ఆయనే పోటీలో ఉంటే మంచిదని సూచించడంతో రంగంలోకి దిగారు.
యువ కెరటం భగత్
టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నోముల భగత్‌కు ఇదే తొలి ఎన్నిక. ఇంజనీరింగ్‌లోను, న్యాయశాస్త్రంలోనూ పట్టభద్రుడైన నోముల భగత్‌కు పలు వృత్తులు నిర్వహించిన అనుభవం ఉంది. 1984 అక్టోబర్ 10న జన్మించిన భగత్ ఇంజినీరింగ్ చదివాడు. అనంతరం ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎల్ఎల్ బీ పూర్తి చేసి హైకోర్టులో లా ప్రాక్టీస్ చేస్తూనే ఎల్ఎల్ఎం పట్టభద్రులు అయ్యారు. 2010-12 మధ్య సత్యం కంపెనీలో జూనియర్ ఇంజినీర్ గా.. అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేశారు. విస్టా ఫార్మా స్యూటికల్స్ లిమిటెడ్ లో మేనేజర్ గా చేశాడు. 2014-2018 వరకు హైకోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేశారు. న్యాయవాదిగా ఎంతో మంది సామాన్యులకు న్యాయసేవ అందిస్తున్నాడు. 2014లో టీఆర్ఎస్ లో చేరిన భగత్ 2014-18 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన తండ్రి నర్సింహయ్యకు ఆర్గ నైజర్ గా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి గెలుపునకు కారణమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను ముందుండి నడిపించారు. కార్యకర్తలకు అండగా ఉంటూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించాడు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ఎంతో కృషి చేశారు. అలాగే ‘నోముల ఎన్.ఎల్ ఫౌండేషన్ చైర్మన్ ‘గా పేద కుటుంబాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. జాబ్ మేళాల నిర్వహణ ద్వారా యువతలో గుర్తింపు పొందారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ అభ్యర్థిగా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
డాక్టర్.. లీడర్ అయ్యేనా
బీజేపీ అభ్యర్థి పి.రవికుమార్ నాయక్‌కు కూడా ఇదే తొలి ఎన్నిక. ఎస్టీ(లంబాడ) సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ రవికుమార్‌నాయక్‌ను 1985లో జన్మించారు. వైద్యశాస్త్రంలో పట్టభద్రుడు. సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగా బీజేపీ అత్యధికంగా 40వేల ఓట్లు ఉన్న ఎస్టీ(లంబాడ)లకు చెందిన రవికుమార్‌నాయక్‌ను ఖరారుచేసింది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి రవికుమార్‌నాయక్ బీజేపీలో చేరారు. స్థానికుడైన రవికుమార్‌నాయక్ నియోజకవర్గ కేంద్రమైన హాలియాలో ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. గతంలో ప్రభుత్వ వైద్యుడిగా సేవలందించారు. నిర్మల ఫౌండేషన్ పేరిట నియోజకవర్గంలో ఆయన గత కొంతకాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు… ఇలా ఓవరాల్‌గా ప్రధాన పోటీదారులైన ముగ్గురు అభ్యర్థుల మధ్య విపరీతమైన తారతమ్యాలు ఉన్నాయి. ఎవరు ప్రజలను ఆకట్టుకుంటారో, ఎవరు నాగార్జునసాగర్‌లో చక్రం తిప్పుతారో వేచి చూడాలి.