iDreamPost
android-app
ios-app

ఒక్కరోజే చాన్స్‌.. మిస్‌ అయితే? : ఆశావాహులకు సెలవుల గుబులు

ఒక్కరోజే చాన్స్‌.. మిస్‌ అయితే? : ఆశావాహులకు సెలవుల గుబులు

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠను రేపుతోంది. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, బీజేపీ ఇప్పటి వరకూ అభ్యర్థులను ప్రకటించలేదు. అసంతృప్తులు పార్టీ మారే అవకాశం లేకుండా చేసేందుకు అధిష్ఠానాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. చివరి రోజు ఆశావహులను అందిరినీ పిలిచి.. ముందుగా తీయటి కబుర్లతో అందరినీ మెప్పించిన అనంతరం అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అధిష్ఠానాల వ్యూహాలు ఎలాగున్నా.. ఆశావాహులకు మాత్రం టెన్షన్‌ టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే నామినేషన్లకు గడువు ఈ నెల 30 వరకూ మాత్రమే. అందులో 27న నాలుగో శనివారం, 28న ఆదివారం, 29న హోలీ పండుగ నేపథ్యంలో నామినేషన్లు స్వీకరించబోమని రిటర్నింగ్‌ అధికారి, మిర్యాలగూడ ఆర్డీవోఓ రోహిత్‌సింగ్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేవలం 30వ తేదీ ఒక్కరోజే నామినేషన్‌కు వేసేందుకు గడువు ఉంది.

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్‌ చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అభివృద్ధికి సుదీర్ఘంగా చర్చించిన అనంతరమే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌ పట్టభధ్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం అభ్యర్థి ఎంపికలో కూడా ఆయన ఇదే పంథా ఆనుసరించారు. నామినేషన్‌కు ఇంకో రెండు రోజులు మాత్రమే గడువు ఉందన్న సమయంలో వాణీదేవిని తెరపైకి తెచ్చారు. ప్రకటించిన అనంతరం నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన తొలిసారి కొన్ని లోటుపాట్ల కారణంగా ఆమె నామినేషన్‌ను అధికారులు తీసుకోలేదు. దీంతో చివరి రోజు అన్ని పత్రాలతో కలిపి వాణీదేవి నామినేషన్‌ వేశారు. ఇంకో రోజు గడువు ఉంది కాబట్టి ఆమె నామినేషన్‌ వేయగలిగారు. కానీ, సాగర్‌ ఉప ఎన్నికలో ఆ పరిస్థితి లేదు. ఇంక కేవలం ఒకరోజు మాత్రమే గడువు ఉంది. ఇదే ఇప్పుడు ఆశావాహుల్లో గుబులు రేపుతోంది. బీజేపీ నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారికీ అదే పరిస్థితి.

ఎవరివారే తమకే టికెట్‌ వస్తుందన్న నమ్మకంతో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నెల 30కు ముందురోజు సాయంత్రం తర్వాతే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. సమయం ఉండదనే ఆందోళనతో పలువురు ముందస్తుగానే అన్ని పత్రాలూ సిద్ధం చేసుకుంటున్నారు. 

ఇప్పటి వరకూ 20 మంది అభ్యర్థులు 23 నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ సాగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కంకణాల నివేదితారెడ్డి పార్టీ కండువా లేకుండానే నామినేషన్‌ వేశారు. టికెట్‌ తనకే అన్న ధీమాతో ఆమె ఉన్నారు. టీడీపీ నుంచి మువ్వా అరుణ్‌కుమార్‌, ఎంఎస్పీ నుంచి ముదిగొండ వెంకటేశ్వర్లు, బహుజన ముక్తి పార్టీ నుంచి కండెల శంకరయ్య, సమాజ్‌వాది ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి వడ్లపల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్లు వేశారు. ఇండిపెండెంట్లుగా కౌతం రవీందర్‌, తగుళ్ల నరేష్‌, పానుగోతు లాల్‌సింగ్‌ నామినేషన్‌ వేశారు. అన్నా వైసీపీ నుంచి కూడా వడ్ల శ్యాంసుందర్‌ నామినేషన్‌ వేయడం గమనార్హం. దీనిపై ఆ పార్టీ పెద్దల నుంచి ఎటువంటి సమాచారమూ లేదు. ఇండిపెండెంట్‌ తలారి రాంబాబు మరోసెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ వేసిన 20మందిలో 12 మంది ఇండిపెండెంట్లుగా కాగా, ఎనిమిది మంది ఆయా పార్టీల నుంచి నామినేషన్లు వేశారు.