iDreamPost
android-app
ios-app

జానారెడ్డి వింత సవాల్ – ప్రచారం చేయకుండా ఎవరి ఇండ్లలో వాళ్ళు కూర్చుందాం‌..!

జానారెడ్డి వింత సవాల్ – ప్రచారం చేయకుండా ఎవరి ఇండ్లలో వాళ్ళు కూర్చుందాం‌..!

నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక స‌మ‌రం వేడెక్కుతోంది. ప్ర‌ధానంగా ఈ ఎన్నిక కాంగ్రెస్ కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మారింది. వ‌రుస ఓట‌ముల‌తో కుంగిపోయిన పార్టీ కాస్త ఊపు కోసం చూస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ హ‌వాకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ కూడా పోరాడుతోంది. పార్టీ సీనియ‌ర్ నేత‌, స్థానికంగా ప‌ట్టున్న జానారెడ్డిని బ‌రిలో దింపి విజ‌యం కోసం శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో భాగంగా ఫిబ్రవరి 10వ తేదీన టీఆర్ఎస్ ఎక్క‌డైతే బ‌హిరంగ స‌భ నిర్వ‌హించిందో, స‌రిగ్గా అదే ప్రాంతం హాలియాలో కాంగ్రెస్ పార్టీ జన గర్జన పేరిట శ‌నివారం బహిరంగ సభ నిర్వహించింది.

ఈ స‌భ‌లో సాగ‌ర్ అభ్య‌ర్థి జానారెడ్డి ఎప్పుడూ లేనంత ఆవేశంగా మాట్లాడారు. ‘‘జానారెడ్డి అంటే పోరాట యోధుడు. శాసన మండలి వ్యవస్థకు ఆద్యుడు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి నేనేంటో తెలుసు. కానీ బయటికి చెప్పడు. ఈ నియోజకవర్గానికి నేనేమీ చేయలేదని టీఆర్ఎస్ చెబుతోంది. కానీ నేను ఏం డెవలప్మెంట్ చేశానో ఆ పార్టీ నేత‌లు వస్తే చూపిస్తా’’ అని స‌వాల్ విసిరారు. తాను గ‌తంలో ఎమ్మెల్యేగా చేసిన‌ప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో తాను చేసిన అభివృద్ధి ఏంటో లెక్క‌ల ద్వారా చెబుతూ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

తెలంగాణలో జరిగిన ప్రతీ ఎన్నికలోనూ కాంగ్రెస్‌కు పరాజయమే మిగులుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో అయితే డిపాజిట్‌ కూడా దక్కలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ చాలా డివిజన్లలో అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌పైనే పార్టీ భవితవ్యం ఆధారపడి ఉంది. నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక కోస‌మే పీసీసీ ఎంపికను సైతం ప‌క్క‌నబెట్టింది. దుబ్బాక నుంచి మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ దాకా తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ మ‌ధ్యే పోరు సాగుతోంది. జానారెడ్డి వ‌ల్ల ఈ సారైన గ‌ట్టి పోటీ ఇచ్చి ట్రెండ్‌ మార్చాలని ఉవ్విళ్లూరుతోంది. దీనిలో భాగంగానే జనగర్జన పేరుతో హాలియాలో నిర్వ‌హించిన స‌భ‌లో జానారెడ్డి కాస్త ఆవేశం ప్ర‌ద‌ర్శించారు.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి నోముల నర్సింహయ్య, కాంగ్రెస్‌ నుంచి జానా రెడ్డి నిలబడ్డారు. ఆ ఇద్దరి మధ్యే హోరాహోరీ పోరు కొనసాగింది. నోములకు 83,655 ఓట్లు పోలవ్వగా.. జానారెడ్డికి 75,884 ఓట్లు పోలయ్యాయి. కేవలం 4 శాతం (7,771) ఓట్ల తేడాతో జానారెడ్డి ఓడిపోయారు. కానీ, ఈసారి గెలిచి తీరాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కుమారుడితో క‌లిసి కొద్ది నెల‌లుగా నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుతూనే ఉన్నారు.

అలాగే తాజాగా జ‌రిగిన స‌భ‌లో జానారెడ్డి మాటల తూటాలు పేల్చారు. ముందుగా తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వీరులకు నివాళులు అర్పించిన జానా.. రాష్ట్ర ఆవిర్భావం కోసం మా పదవులు త్యాగం చేశామని చెప్పారు. ఈ ప్రాంతంలో లక్షల ఎకరాలకు నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన అన్నారు. పెద్దవూరలో అభివృద్ధి శూన్యం అని మాట్లాడిన టీఆరెస్ నాయకులే శూన్యంలో ఉన్నారని చురకలంటించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు నీరందించిన వ్యక్తి జానారెడ్డి అని ఆయన గర్వంగా చెప్పారు. సాగునీరు, రోడ్లు, విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు.. ఇలా సాగర్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిపై లెక్కలతో వచ్చిన జానారెడ్డి టీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో 953 కిలోమీటర్లు రోడ్లు ఉన్నది సాగర్ నియోజకవర్గంలోనేనన్నారు. నా గణాంకాలకు సీఎం కేసీఆరే జవాబు చెప్పాలని.. వేరే వాళ్లు చెబితే లెక్కచేయనని జానా రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి ఇవాళ శనివారం ఒక తమాషా సవాల్ విసిరారు. అన్ని పార్టీల వాళ్లూ నామినేషన్లు వేసి సైలెంటుగా ఇంట్లోనే కూర్చుందామని, ఎవరూ ప్రచారం చేయొద్దని, అప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దామని ఛాలెంజ్ చేశారు. ఇలా చేస్తే తానే తప్పకుండా విజయం సాధిస్తాననేది ఆయన ధీమా. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో, బీజేపీ నేతలు వాళ్ల భవన్ లో, తాను గాంధీ భవన్ లో కూర్చుందామని సూచించారు. నాకు రాజకీయ వారసులంటే నా బిడ్డో కాదు.. నా కొడుకో కాదు.. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తా నా వారసుడే అని జానారెడ్డి భావోద్వేగంతో చెప్పారు.

ఉప ఎన్నికలో 50 వేల మెజార్టీతో గెలవబోతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హాలియాలో కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభలో మాట్లాడిన ఉత్తమ్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరుగుతాయని చెప్పారు. సాగర్‌లో బీజేపీ డిపాజిట్ కోల్పోవడం ఖాయమని ఎద్దేవాచేశారు. అధికారపార్టీ డబ్బు సంచులతో ప్రలోభాలకు గురిచేస్తారని, అయినా నమ్మొద్దని ప్రజలకు ఆయన సూచించారు. 2023లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పునకు నాగార్జునసాగర్ ఉప ఎన్నికే నాంది పలకాలని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ ని గెలిపించి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరారు.