iDreamPost
android-app
ios-app

నాగార్జున‌సాగ‌ర్ : ‌తెర‌పైకి కొత్త కొత్త అభ్య‌ర్థుల పేర్లు

నాగార్జున‌సాగ‌ర్ : ‌తెర‌పైకి కొత్త కొత్త అభ్య‌ర్థుల పేర్లు

నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక రూపంలో రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాలకు మరో పరీక్ష ఎదురుకానుంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయిన టీఆర్‌ఎస్‌ ఈసారి ఎలాగైనా సాగర్‌ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఇప్పటికే తీవ్ర‌మైన కసరత్తు చేస్తోంది. ఆ దిశ‌గా ఇప్ప‌టికే కొంత స్థానికంగా సానుకూల ఫ‌లితాలు వ‌స్తున్న‌ట్లుగా ఆయా ప్రాంతాల ఇన్‌చార్జులు అధిష్ఠానానికి స‌మాచారం పంపుతున్నారు.

గ‌తంలోనే ఈ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించగా, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈ ఉపఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే మండలాల వారీగా ఎమ్మెల్యేలను ఇంచార్జిలుగా నియమించారు. ఇప్పుడు షెడ్యూల్‌ వెలువడటంతో గ్రామం, వార్డు, పోలింగ్‌ బూత్‌ స్థాయిలో టీఆర్‌ఎస్‌ ప్రణాళిక అమలు చేయనుంది. అయితే, ఇక్కడ అభ్యర్థి ఎవరన్నది మాత్రం టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఇంకా తేల్చలేదు. దీంతో రోజు రోజుకూ కొత్త కొత్త పేర్లు తెర‌పైకి వ‌స్తున్నాయి.

Also Read:“తిరుపతి” వ్యూహం మార్చుకుంటున్న విప‌క్షాలు

దివంగత శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య కుమారుడు భగత్, ఆ పార్టీ నాయకులు తేరా చిన్నపరెడ్డి, ఎం.సి.కోటిరెడ్డిల పేర్లు మొదట్లో వినిపించినా… సర్వేల అనంతరం స్థానికుడైన బీసీ నాయకుడిని బరిలోకి దింపాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తొమ్మిదిసార్లు పోటీ చేసి ఏడుసార్లు గెలిచిన కాంగ్రెస్‌ దిగ్గజం జానారెడ్డిని ఢీకొట్టాలంటే బలమైన అభ్యర్థి కావాలంటూ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే యాదవ సామాజిక వర్గాన్ని పక్కన పెడితే ఇబ్బందే అని మరోసారి తేలడంతో అదే సామాజిక వర్గానికి చెందిన స్థానిక టీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గరు కొత్త ముఖాలకు స్వయంగా సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేసి ‘మీ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నాం’ అంటూ నియోజకవర్గం భౌగోళిక స్వరూపం, వివిధ సామాజిక వర్గాల ఓట్లు, వాటిని కలుపుకుపోవడం, ఎదుటి పక్షాల బలాల వంటి అన్ని వివరాలను అడిగారు‘ అని తాజాగా తెలిసింది. ఈ క్ర‌మంలో సీఎం ఫోన్‌తో మాట్లాడింది వీరితోనేనంటూ పెద్దబోయిన శ్రీనివాస్‌, గురవయ్య, రంజిత్‌ యాదవ్‌ల పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి.

బీజేపీ కూడా ఈ ఎన్నిక కోసం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. స్థానిక నాయకుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి సతీమణి నివేదిత అభ్యర్థిత్వంతో పాటు టీడీపీ నుంచి వచ్చిన కడారి అంజయ్య యాదవ్, డాక్టర్‌ రవికుమార్‌ పేర్లను కూడా పరిశీలిస్తోంది. అయితే, ఈ ముగ్గురిలో ఒకరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారా? లేదా అనూహ్యంగా కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్, కేంద్ర మంత్రి తోమర్‌లు కూడా నియోజకవర్గంలో పర్యటించారు. షెడ్యూల్‌ వెలువడటంతో ఇక రాష్ట్ర కమలనాథులందరూ సాగర్‌ బాట పట్టనున్నారు. మొత్తంమీద సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల అసెంబ్లీ సంతాపం వ్యక్తం చేసిన రోజే ఉపఎన్నిక షెడ్యూల్‌ వెలువడింది. మరో నెలరోజుల పాటు కృష్ణానదీ తీరంలో రాజకీయాలు వేడెక్కనున్నాయి.

Also Read:కొండా విశ్వేశ్వరరెడ్డి కొత్త పార్టీ పెడుతున్నారా..?

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక కోసం ఏకంగా టీపీసీసీ అధ్యక్ష ఎంపికనే వాయిదా వేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ కూడా సాగర్‌లో గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇక్కడి నుంచి సీనియర్‌ నేత కె.జానారెడ్డిని అభ్యర్థిగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో జానారెడ్డి, ఆయన కుమారుడు రఘువీర్‌లు ఇప్పటికే రెండుసార్లు నియోజకవర్గాన్ని చుట్టివచ్చారు. వీలున్న చోటల్లా తమ నుంచి దూరంగా వెళ్లిన వారిని మళ్లీ అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో గెలుపు అనివార్యం కావడంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి త‌దిత‌రులు సీనియ‌ర్లు కూడా ఇక‌పై నాగార్జున సాగ‌ర్ లోనే ఎక్కువ స‌మ‌యం ఉండేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థిపై మాత్ర‌మే క్లారిటీ ఉండ‌డం, బీజేపీ, టీఆర్ఎస్ లు ఇంకా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో వారెవ‌ర‌నేది ఆస‌క్తిగా మారింది.