iDreamPost
android-app
ios-app

నాదల్ -21 గ్రాండ్ స్లామ్స్ తో ప్రపంచ రికార్డ్

నాదల్ -21 గ్రాండ్ స్లామ్స్ తో ప్రపంచ రికార్డ్

అంతర్జాతీయ టెన్నిస్ చరిత్రలో ఎవరూ ఊహించని అడుగు పడింది. దిగ్గజాలకు సాధ్యంకాని రికార్డుని టెన్నిస్ సంచలనం రాఫెల్ నాదల్ సొంతం చేసుకున్నాడు. చాలామందికి అందినట్టే అందిన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టెన్నిస్ చరిత్రలో ఒక ప్రపంచ రికార్డును ముగ్గురు యోధులు పంచుకుని ఏడు నెలల నుంచి ప్రయాణం చేస్తున్నారు. అదే 20 గ్రాండ్ స్లాం లు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, జొకోవిచ్ లు గెలవడం. అక్కడి నుంచి ఒక్కటి గెలిచినా సరే ముగ్గురిలో ఎవరో ఒకరు కొత్త చరిత్ర సృష్టించినట్టే.

ఇప్పుడు ఆ రికార్డుని సాధించి చరిత్ర సృష్టించాడు నాదల్. గత సెప్టెంబర్ లో యుఎస్ ఓపెన్ జరగగా అప్పుడు జకోవిచ్ సొంతం అవుతుంది ఆ రికార్డు అని భావించారు. కాని మెద్వెదేవ్ రూపంలో ఆ రికార్డుకి బ్రేక్ పడింది. ఇక ఈ ఏడాది మొదట్లో సాధిస్తాడు అని అందరూ ఎదురుచూసినా అది కూడా సాధ్యంకాలేదు. ఆస్ట్రేలియా ఓపెన్ విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ దేశంలో అడుగు పెట్టాడు. ఇప్పటికే 9 సార్లు గెలిచి పదో టైటిల్ కోసం ఆశగా చూసాడు. కాని వ్యాక్సిన్ వేసుకోకుండా వెళ్ళడంతో ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం అతన్ని అనుమతించలేదు.

దీనితో ఈ టోర్నీలో అతను ఆడలేదు. ఇక ఇప్పుడు యూఎస్ ఓపెన్ లో జకోవిచ్ కు టైటిల్ దూరం చేసిన మెద్వదేవ్… ఈసారి నాదల్ కు ఫైనల్ లో ఎదురయ్యాడు. నాదల్ కు అత్యంత బలహీన రికార్డు ఉన్న ఇక్కడ ఎంత వరకు సాధిస్తాడు అనేది ఆసక్తిగా మారింది. 2009 లో ఫెదరర్ పై గెలిచిన తర్వాత ఈ టోర్నీలో 5 సార్లు ఫైనల్ ఆడి ఒక్కసారి మాత్రమే విజేతగా నిలిచాడు. చరిత్రను పక్కన పెట్టి… కసితో జారిపోతుందని భావించిన మ్యాచుని సాధించాడు. 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ఏకైక పురుష టెన్నిస్ ప్లేయర్ గా నిలిచాడు.

స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ కు గత రెండేళ్ళలో ఇదే తొలి గ్రాండ్ స్లాం. చివరిసారిగా 2020లో ఫ్రెంచ్ ఓపెన్ గెలవగా… ఆ తర్వాత యూఎస్ ఓపెన్ సహా కొన్నింటిలో ఓటమి పాలయ్యాడు. 2009లో తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్ లో విజేతగా నిలిచి సరిగా 13 ఏళ్లకు రెండో సారి టైటిల్ గెలిచి సంచలనం సృష్టించాడు. వరల్డ్ నెంబర్ 2 డానిల్ మెద్వెదేవ్‌తో ఆడిన ఫైనల్ లో ఏకంగా టైటిల్ కోసం 5 గంటల పాటు పోరాటం జరిగింది. ముందు వెనుకబడినా సరే ఆ తర్వాత నిలబడి, కలబడి గెలిచాడు.