iDreamPost
iDreamPost
ఇంకో పదే రోజుల్లో మణిరత్నం డ్రీం ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది. తమిళ వెర్షన్ కోసం ప్రమోషన్లు బాగానే చేస్తున్నారు. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష తదితరులు యాక్టివ్ గా వీటిలో పాల్గొంటున్నారు. వచ్చే వారం నుంచి ఐశ్వర్య రాయ్ కూడా తోడవ్వబోతోంది. రెండు వందల కోట్ల బడ్జెట్ తో కోలీవుడ్ బాహుబలిగా అక్కడి మీడియా ప్రస్తుతిస్తున్న ఈ విజువల్ గ్రాండియర్ కి ఇతర భాషల్లో అంతగా బజ్ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తెలుగు జనాలకు సైతం అవగాహన లేని యుద్ధవీరుడి కథ కావడంతో ఏమంత ఆసక్తి చూపించడం లేదు. పైగా క్యాస్టింగ్ లో తెలుగు మొహం లేకపోవడమూ కారణమే.
నిజానికీ పొన్నియన్ సెల్వన్ 1 కి ముందు వెనుకా విపరీతమైన పోటీ నెలకొంది. ఒక రోజు ముందు ధనుష్ నేనే వస్తున్నా రిలీజ్ ని క్రేజీగా ప్లాన్ చేశారు. సెల్వ రాఘవన్ దర్శకుడు కావడంతో పాటు తిరు బ్లాక్ బస్టర్ సక్సెస్ వల్ల బిజినెస్ క్రేజీగానే ఉంది. తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయడానికి అల్లు అరవింద్ ముందుకు రావడంతో థియేటర్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో దొరుకుతాయి. క్రైమ్ ప్లస్ డిఫరెంట్ థ్రిల్లర్ గా రూపొందిన నేనే వస్తున్నాలో ధనుష్ డ్యూయల్ రోల్ చేశాడు. అలా చూసుకుంటే మన ఆడియన్స్ పొన్నియన్ సెల్వన్ కన్నా ఎక్కువగా నేనే వస్తున్నా మీద మక్కువ చూపే ఛాన్స్ ఉంది. రెండింటికి చాలా బాగుందనే టాక్ రావడం కీలకం కాబోతోంది. లేదంటే కష్టం.
అదే రోజు వస్తున్న హృతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్ ల విక్రమ్ వేదా ఉత్తరాది రాష్ట్రాల్లో పొన్నియన్ కు ముప్పుగా మారుతుంది. దీన్ని ఢీ కొట్టడం అంత సులభం కాదు. గతంలో సైరా నరసింహారెడ్డి ఇదే తరహాలో వార్ తో క్లాష్ చేసుకున్నప్పుడు మెగాస్టార్ అక్కడ వసూళ్లు రాబట్టలేకపోయాడు. ఇదంతా పక్కన పెడితే సరిగ్గా వారం తిరక్కుండానే అక్టోబర్ 5న వచ్చే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లతో పొన్నియన్ కు మరిన్ని చిక్కులు తప్పవు. స్క్రీన్లు తగ్గడమే కాదు పండగ మూడ్ లో జనం చిరంజీవి, నాగార్జునలను చూసేందుకు ఎక్కువ ఇష్టపడతారు. మరి ఇంత పెద్ద పోటీ ముసురుకున్న పొన్నియన్ ఈ యుద్ధంలో ఎలా గెలుస్తాడో. పాటలకు సైతం రెస్పాన్స్ సోసోగానే ఉంది