iDreamPost
android-app
ios-app

న్యాయం కోసం నరేష్ పోరాటం

  • Published Jun 30, 2020 | 5:36 AM Updated Updated Jun 30, 2020 | 5:36 AM
న్యాయం కోసం నరేష్ పోరాటం

సోలో హీరోగా గత కొన్నేళ్ళుగా సక్సెస్ కు దూరంగా ఉన్న అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న నాంది టీజర్ తన బర్త్ డే సందర్భంగా టీమ్ విడుదల చేసింది. రెండు రోజుల క్రితం వదిలిన క్యారెక్టర్ పోస్టర్లు మంచి స్పందన తెచ్చుకున్న నేపథ్యంలో నాంది మీద అంచనాలు పెరిగాయి. నిమిషంన్నర వీడియోనే అయినప్పటికీ కథ ఏంటో చూచాయగా చెప్పేశారు. దేశం మొత్తం మీద ఉన్న కొన్ని వేల జైళ్లలో 3 లక్షలకు పైగా ఖైదీలు శిక్షను అనుభవిస్తున్నారు. అందులో 25 వేల మంది తాము నిజంగా తప్పు చేశామో లేదో తెలియని సందిగ్ధంలో ఉంటూ న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు.

వీళ్ళనే అండర్ ట్రయల్స్ అంటారు. తీర్పు వచ్చేదాకా వీళ్ళు దోషులుగా పరిగణింపబడరు. ఇందులో నిరపరాధులే ఎక్కువగా ఉంటారు. వీళ్ళలో నాంది కథానాయకుడు ఒకడు. చేయని తప్పుకు జైలుకు వెళ్తాడు. అక్కడ పడకూడని బాధలు, నరకం అన్నీ చవిచూస్తాడు. తల్లి గర్భంలో నుంచి బయటికి రావడానికి 9 నెలలు పడితే మరి ప్రజాస్వామ్య దేశంలో న్యాయం జరగడానికి ఎన్నేళ్ళు కావాలని అల్లరి నరేష్ ప్రశ్నించడంతోనే స్టోరీలోని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఏ హీరో సాహసించని రీతిలో నరేష్ నిజంగానే నగ్నంగా నటించినట్టు ఓ సన్నివేశం ద్వారా స్పష్టం చేసేశారు. పెర్ఫార్మన్స్ పరంగానూ చాలా డెప్త్ చూపించాడు నరేష్.

విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్న నాందికి సతీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టేకింగ్ చూస్తే థీమ్ కు కట్టుబడి కమర్షియల్ అంశాలకు ఎక్కువగా చోటివ్వకుండా సీరియస్ గా టాపిక్ మీదే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఇలాంటి జానర్ సినిమాలు టాలీవుడ్ లో అరుదైపోతున్న నేపథ్యంలో నాంది ఆసక్తి రేపుతోంది. వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియదర్శి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగర్, మణిచందన తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న నాందిని త్వరలో విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది.

Link Here @ https://bit.ly/2ZsBHjc