iDreamPost
android-app
ios-app

అల్లరోడికి ఊపిరినిచ్చిన నాంది

  • Published Feb 22, 2021 | 11:35 AM Updated Updated Feb 22, 2021 | 11:35 AM
అల్లరోడికి ఊపిరినిచ్చిన నాంది

మొన్న విడుదలైన నాలుగు సినిమాల్లో స్పష్టమైన విజేతగా అల్లరి నరేష్ నాంది మిగిలింది. తన ఇమేజ్ కి భిన్నంగా కామెడీ లేకుండా సీరియస్ సబ్జెక్టుని ఎంచుకున్న వైనం ఆశించిన దాని కన్నా మంచి ఫలితాన్నే ఇచ్చింది. తొలుత ఇది కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతుందా లేదా అనే అనుమానాలకు తెరదించుతూ మూడు రోజులకు గాను సుమారుగా 11 కోట్ల దాకా గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ న్యూస్. ఇందులో షేర్ గట్రా చూసుకుంటే 5 నుంచి 6 కోట్ల మధ్యలో ఉండొచ్చు. ఇది చాలా డీసెంట్ మొత్తం. ఇంకా వారం టైం ఉంది. నితిన్ చెక్ వచ్చేదాకా ఇంకే పోటీ సినిమాలు లేవు. ఉన్నంతలో ఉప్పెనే స్ట్రాంగ్ గా కనిపిస్తోంది.

ఇదే రన్ ని కొనసాగిస్తే నాంది నిర్మాతలకు సేఫ్ వెంచర్ గా మిగిలిపోతుంది. అయితే ఇవాళ నుంచి కలెక్షన్ డ్రాప్ సహజంగానే ఉంటుంది కాబట్టి ఎంతమేరకు వసూళ్లు నమోదవుతాయో చూడాలి. విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇది కూడా ఫార్ములాకి భిన్నంగా సాగేలా మరో కాంటెంపొరరీ ఇష్యూ ని తీసుకోబోతున్నారట. కోర్ట్ రూమ్ డ్రామాలా కాకుండా ఏదో సోషల్ మెసేజ్ ని ఎంచుకోబోతున్నట్టు తెలిసింది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలుస్తాయి. నాంది నరేష్ తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, ప్రవీణ్, దేవి ప్రసాద్, హరీష్ ఉత్తమన్ తదితరులకు కూడా మంచి పేరు తెచ్చింది.

నాంది రిజల్ట్ ఒకరకంగా నరేష్ కు సూచిక లాంటిది. తాను పాత కామెడీని నమ్ముకుంటే జనం ఎంత దారుణంగా తిరస్కరిస్తారో జనవరిలో వచ్చిన బంగారు బుల్లోడు ద్వారా మరోసారి రుజువయ్యింది. అందుకే అలాంటి రిస్కులు చేయకపోవడం ఉత్తమం. అసలే ఇది జబర్దస్త్ జమానా. లెక్కలేనన్ని కామెడీ రియాలిటీ షోలు టీవీ ఛానల్స్ ని ముంచెత్తుతున్నాయి. ఫ్రీగా చూసే అవకాశాన్ని పబ్లిక్ బాగా వాడుకుంటున్నారు. అలాంటిది అంతకన్నా తక్కువ హాస్యాన్ని డబ్బులిచ్చి చూడమంటే సిద్ధంగా లేరు. అందులోనూ జంధ్యాల, రేలంగి నరసింహారావు మార్కు కామెడీ రాసే రచయితలే లేరు. కాబట్టి ఇకపై మహర్షి, నాంది చూపిన దారిలో నరేష్ వెళ్లడం ఉత్తమం