iDreamPost
android-app
ios-app

మరో ఆహా అనిపించే సినిమా

  • Published Mar 07, 2021 | 4:44 AM Updated Updated Mar 07, 2021 | 4:44 AM
మరో ఆహా అనిపించే సినిమా

థియేటర్ కు ఓటిటికి మధ్య గ్యాప్ ఏ స్థాయిలో తగ్గిపోతోందో లాక్ డౌన్ టైంలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిన్న అక్షర కేవలం వారం రోజుల వ్యవధిలో అమెజాన్ ప్రైమ్ లో వచ్చేసింది. జస్ట్ ఏడు రోజుల ముందు థియేటర్లో చూసినవాళ్లు అర్రె అనుకోవాల్సిందే. దీనికి చిన్నా పెద్ద మినహాయింపు ఉండటం లేదు. ఆ మధ్య రవితేజ క్రాక్ ని ఇరవై రోజులకు స్ట్రీమింగ్ ప్లాన్ చేస్తే మంచి రన్ ఉన్న కారణంగా నిర్మాతల అభ్యర్థన మేరకు ఇంకో వారం వాయిదా వేసి నెల తిరక్కుండానే ఫైనల్ గా ప్రసారం చేసేశారు. త్వరలోనే స్టార్ మాలో టెలికాస్ట్ కాబోతోంది కూడా. ఇటీవలే మిస్టర్ అండ్ మిస్, చెప్పినా ఎవరూ నమ్మరు లాంటి సినిమాలు కూడా రోజుల నిడివిలోనే వచ్చేసాయి.

ఇక నాంది విషయానికి వస్తే మహాశివరాత్రి కానుకగా మార్చ్ 12న ఆహా యాప్ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ చేయబోతోంది. అంటే సరిగ్గా విడుదలైన తేదికి 22వ రోజు స్మార్ట్ ఫోన్లు టీవీలలో చూసుకోవచ్చన్న మాట. ఇప్పటికే దాదాపు ఫైనల్ రన్ కు దగ్గరలో ఉన్న నాంది వచ్చే వారం నుంచి హాళ్లలో నుంచి మాయం కాక తప్పదు. చాలా సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఇకపై వసూళ్లు రావడం కష్టమే. అందులోనూ నాంది ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ దాటేసి బయ్యర్లకు ఎప్పుడో లాభాలను ఇచ్చింది. సీరియస్ సబ్జెక్టు మీద దర్శకుడు విజయ్ కనకమేడల రూపొందించిన విధానానికి ప్రశంసలు కలెక్షన్లు రెండూ దక్కాయి.

అల్లరి నరేష్ చాలా ఏళ్ళ తర్వాత కొట్టిన హిట్ కాబట్టి స్ట్రీమింగ్ కి రెస్పాన్స్ భారీగా ఉండే అవకాశం ఉంది. అందులోనూ వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ కూడా సోషల్ మీడియాలో గట్టి ప్రశంసలు దక్కించుకుంది. ఇటీవలి కాలంలో ఆహా దూకుడు పెంచుతోంది. రైట్స్ కోసం గట్టి పెట్టుబడులు పెడుతోంది. అందులో భాగంగానే ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజాలతో పోటీ పడి మరీ క్రాక్, నాంది లాంటి సినిమాలు సొంతం చేసుకుంది. మరోవైపు మలయాళం డబ్బింగ్ వెర్షన్లు కూడా మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడున్న యాప్స్ లో తక్కువ ఏడాది చందా ఉన్నది ఆహా ఒకటే. ఇదే జోరు కొనసాగిస్తే గట్టిగ సెటిలై పోవచ్చు.