iDreamPost
android-app
ios-app

విజయ్ మీద మైత్రి బిగ్ స్కెచ్ ?

  • Published Feb 10, 2021 | 9:41 AM Updated Updated Feb 10, 2021 | 9:41 AM
విజయ్ మీద మైత్రి బిగ్ స్కెచ్ ?

ఒకప్పుడు తమిళ హీరోల డబ్బింగ్ మార్కెట్ జోరుగా ఉండేది. రజినీకాంత్, సూర్య, విక్రమ్ లాంటి వాళ్లకు మన స్టార్లకు ధీటుగా భారీ ఓపెనింగ్స్ దక్కేవి. కానీ ఇదంతా గతం. కేవలం ఇమేజ్ ని బట్టి ఆరవ హీరోలను నెత్తినబెట్టుకోవడం తెలుగు ప్రేక్షకులు తగ్గించేశారు. సినిమా బాగుందంటే చూసి మంచి వసూళ్లు ఇస్తారు లేదంటే రెండో వారానికి దుకాణం సర్దాల్సిందే. బిచ్చగాడుతో సెన్సేషన్ సృష్టించిన విజయ్ ఆంటోనీ కూడా తర్వాత అందులో పావు వంతు కూడా ఏ సినిమాతో హిట్టు కొట్టలేకపోయాడు. ఇప్పుడు విజయ్ సుడి నడుస్తోంది. మొన్న మాస్టర్ టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లు దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది

తాజాగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ విజయ్ కు పది కోట్ల అడ్వాన్స్ ఇచ్చి ఓ మల్టీ లాంగ్వేజ్ మూవీ కోసం ఒప్పందం చేసుకున్నారనే వార్త అటు చెన్నై ఇటు హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇప్పుడు విజయ్ ది వందల కోట్ల మార్కెట్. యావరేజ్ గా ఉన్నా చాలు ఏ సినిమా అయినా ఈజీగా నూటా యాభై కోట్ల దాకా రాబడుతోంది. కొత్తగా తెలుగులో కూడా మార్కెట్ పెరుగుతోంది. మొన్న వచ్చిన 14 కోట్ల షేర్ భారీ మొత్తం కాకపోయినా ఇది క్రమంగా పెరుగుతుందనే అంచనాలో ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ కూడా ఉంది. కాకపోతే వరసగా సాలిడ్ బ్లాక్ బస్టర్లు అవసరం. విజయ్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

ఇక్కడ గమనిస్తే మైత్రి వాళ్ళు మెల్లగా కోలీవుడ్ లో కూడా జెండా పాతే ప్లాన్ లో ఉన్నారు. తెలుగు వెర్షన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది పక్కనబెడితే ఒక్క తమిళం నుంచే విజయ్ సినిమా రెట్టింపు రెవిన్యూని లాభాలను ఇస్తుంది. అందుకే ఇలా లాక్ చేసుకున్నట్టు తెలిసింది. అయితే దర్శకుడు ఎవరు అనేది ఇప్పట్లో తేలదు. కెజిఎఫ్, సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ బ్యానర్ కు ఓ కమిట్ మెంట్ ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ తో ఉండొచ్చని టాక్ ఉంది. ఒకవేళ ఇది మిస్ అయితే విజయ్ ని ప్రశాంత్ ని కలిపితే ఇంకెంత రచ్చ జరుగుతుందో వేరే చెప్పాలా. ఇవన్నీ లాంగ్ టర్మ్ ప్లాన్ల రూపంలో ముందే సిద్ధం చేసుకుంటున్నారు